Indiramma Indlu | హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిబంధనలతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మంజూరైన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభం కాకుంటే ఇల్లు రద్దవుతుందని షరతు విధించడంతో లబోదిబోమంటున్నారు. ఉన్నఫలంగా డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అర్థంకాక ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం రూ.5లక్షలు ఇస్తుందా? ఇస్తే ఎప్పటిలోగా ఇస్తుంది? అనేది స్పష్టత లేదు. తీరా అప్పోసప్పో చేసుకొని ఇంటి నిర్మాణం చేపట్టాక ప్రభుత్వం నుంచి నిధులు రావడం ఆలస్యమైతే ఏమిచేయాలో అర్థంకాక వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం విధించిన షరతుతో లబ్ధిదారులకు ఇల్లు మంజూరైందనే ఆనందం కూడా లేకుండా పోయింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటిదశలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని గ్రామాల్లో కొందరు లబ్ధిదారులను ఎంపిక చేసి, మంజూరు పత్రాలు పంపిణీ చేసింది. పునాదులు నిర్మించిన తర్వాత లక్ష, స్లాబు పడ్డాక 2 లక్షలు, మిగిలిన పనులు పూర్తయ్యాక మరో 2 లక్షలు విడుదల చేస్తామని పేర్కొంది. కానీ మంజూరు పత్రాలు అందిన 45 రోజుల్లోగా నిర్మాణం ప్రారంభించకపోతే ఇల్లు రద్దు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ నిబంధనలే పేదల పాలిట శాపంగా మారాయి. పునాది వరకు నిర్మించేందుకు కనీసం రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. నిరుపేదలు ఇంత భారీ మొత్తాన్ని సమకూర్చుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఇప్పటికిప్పుడు అప్పుపుట్టక పోవడంతో ఇల్లు రద్దవుతుందేమోనని చాలామంది లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో అనుబంధంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. రాష్ర్టానికి 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. కానీ ఎన్ని ఇండ్లు మంజూరు చేస్తుందో, ఎన్ని నిధులు ఇస్తుందో ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టతలేదు. ఒకవేళ కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులందరికీ మొత్తం 5లక్షలు ఇస్తుందా? అని లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు.