హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సీ ప్రియాంక తెలిపారు. నాంపల్లిలోని మీడియా అకాడమీలో గురువారం జర్నలిస్టుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జర్నలిస్టుల ప్రయోజనాలను కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న మీడియా అకాడమీకి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు.
ఎప్పటికప్పుడు ప్రజల మధ్య జరిగే ప్రతి విషయాన్ని తిరిగి ప్రజలకు అందించడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని కొనియాడారు. సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా, నిక్కచ్చగా, నిజాయితీగా తెలియజేయాలని కోరారు. జర్నలిస్టుల బీమా పథకంలో ఉన్న లోపాలను సరిదిద్ది, సక్రమంగా అమలయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల ప్రమాదాలకు గురై, పనిచేయలేని స్థితిలో ఉన్న 180 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్టు వెల్లడించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.3000 చొప్పున పెన్షన్ అందిస్తున్నట్టు చెప్పారు. మీడియా అకాడమీ ద్వారా ఎడిటర్లు, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ఎడిటర్లు, అధికారులు పాల్గొన్నారు.