హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ తేల్చిచెప్పారు. నాడు ఓట్ల కోసం అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత అరిగోసపెడుతుందని ధ్వజమెత్తారు. నోటీసులిచ్చి సమ్మెకు వెళ్లిన సిబ్బందితో చర్చించకుండా అణచివేతకు పాల్పడడం దుర్మార్గమని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మరణించిన శంకర్ కుటుంబానికి మెరుగైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మాహత్యాయత్నం చేసిన కార్మికులకు మెరుగైన వెద్యం అందించాలని కోరారు.