హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయమై ఇటీవల జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వుల వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు ఎదురొనే పరిస్థితి ఏర్పడుతుందని పేరొన్నది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటాన్ని, ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాలు చేస్తూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు గతంలో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ కేసుల్లో హైకోర్టు వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని ప్రభుత్వం తాజాగా పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. ప్రభుత్వ అభ్యర్థనను పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకరించారు.
గతంలో దాఖలైన ప్రధాన పిటిషన్లలో కౌంటర్లు దాఖలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులను సవరించాలంటూ ప్రభుత్వం కొత్త పిటిషన్ వేయడం సరికాదని పేర్కొన్నారు. ఆ ఉత్తర్వులు అమ లు చేసేలా ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించాలని కోరారు. విద్యార్థుల ఖాతాల్లో ఫీజు మొత్తాన్ని జమ చేస్తామని, అనంతరం ఆ సొమ్మును వారంలోగా కళాశాలలకు చెల్లించాలని ప్రభుత్వం చెప్తున్నదని పేర్కొంటూ.. ప్రభుత్వం జమచేసిన మొత్తాలను విద్యార్థులు చెల్లించకపోతే కళాశాలల పరిస్థితి ఏమిటనే సందేహాన్ని లేవనెత్తారు. ప్రభుత్వ న్యాయవా ది శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ.. గతంలోని మధ్యంతర ఉత్తర్వులను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం చెల్లించిన మొత్తాలను విద్యార్థుల నుంచి వసూలు చేయడాన్ని వ్యతిరేకించడం లేదని, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమచేసే వరకు మాత్రమే కళాశాలలు వేచి ఉండాలని తెలిపారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో తొలి విడత అడ్మిషన్లకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని చెప్పారు. ఈ వాదనల అనంతరం హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.