హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్యభద్రత పథకంపై కీలక ముందడుగు పడింది. ఎట్టకేలకు ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టును సర్కార్ ఏర్పాటు చేసింది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను నియమిస్తూ బుధవారం జీవో 40 జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ట్రస్టు బోర్డుకు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. 15 ప్రభుత్వశాఖల కార్యదర్శులు (ఐఏఎస్) ట్రస్టు బోర్డులో సభ్యులుగా ఉంటారు.
ఈహెచ్ఎస్ సీఈవో మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు సీఈవోకు ఈహెచ్ఎస్ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. వీలైనంత త్వరగా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మార్గదర్శకాలను ప్రతిపాదించాలని, కార్డుల జారీకి సంబంధించిన విధానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఐఏఎస్ అధికారులతోపాటు మరో 13 మంది ఉద్యోగసంఘాల నేతలను బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా సర్కార్ నియమించింది.
మారం జగదీశ్వర్(టీఎన్జీవో), ఏలూరి శ్రీనివాసరావు (టీజీవో), పుల్గం దామోదర్‌రెడ్డి (పీఆర్టీయూ టీఎస్), సీహెచ్ రవి (టీఎస్ యూటీఎఫ్), గిరి శ్రీనివాస్‌రెడ్డి (సచివాలయ ఉద్యోగుల సంఘం), జీ సదానందంగౌడ్ (ఎస్టీయూ టీఎస్), వంగ రవీందర్‌రెడ్డి (ట్రెసా), వీ లచ్చిరెడ్డి (డిప్యూటీ కలెక్టర్ల సంఘం), బీ సైదులు (ఎస్టీఎఫ్), దాస్యానాయక్ (నాలుగోతరగతి ఉద్యోగుల సంఘం), పేరి వెంకట్‌రెడ్డి (తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్), పీ కృష్ణమూర్తి (తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్), ఆర్ ఉమాదేవి (తెలంగాణ విమెన్ పెన్షనర్స్ అసోసియేషన్)లకు సభ్యులుగా చోటు కల్పించింది. అయితే ట్రస్టులో కొన్ని సంఘాలకు మాత్రమే చోటు కల్పించడంపై అసంతృప్తరాగాలు వినిపిస్తున్నాయి.
ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టులో 2.6 లక్షల సీపీఎస్ ఉద్యోగుల ప్రాతినిధ్యమేదని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ సర్కార్‌ను ప్రశ్నించింది. బోర్డు ఆఫ్ ట్రస్టీల్లో సీపీఎస్ఈయూకు చోటు కల్పించకపోవడంపట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న సంఘానికి చోటు కల్పించకపోవడం శోచనీయమన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే స్పంది ంచి సీపీఎస్ఈయూకు భాగస్వామ్యం కల్పించాలని, జీవో 40 సవరించాలని డిమాండ్ చేశారు. ట్రస్టులో తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీకి స్థానం కల్పించకపోవడం అన్యాయమని జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి తులసి సత్యనారాయణ వాపోయారు. 42 సం ఘాలు, 2 లక్షల మంది పెన్షనర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జేఏసీకి చోటు కల్పించకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఈ అన్యాయాన్ని వెంటనే సరిచేయాలని, లేదంటే పోరాట కార్యాచరణను ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు.