శనివారం 04 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 02:15:34

ప్రాధాన్యరంగం చేనేత

 ప్రాధాన్యరంగం చేనేత

  • లాక్‌డౌన్‌లో కార్మికులను ఆదుకొనేందుకు చేయూత
  • థ్రిఫ్ట్‌ ఫండ్‌ పొదుపు కింద రూ.92.1 కోట్లు విడుదల
  • 10వేలకుపైగా కుటుంబాలకు రూ.29 కోట్ల రుణ మాఫీ 
  • చేనేత కార్మికుల సంక్షేమంపై హైకోర్టులో ప్రభుత్వ అఫిడవిట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత చేనేత రంగాన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని న్యాయవాది రాపోలు భాస్కర్‌ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హ్యాండ్లుమ్స్‌, టెక్స్‌టైల్‌ అండ్‌ అపారెల్‌ ఎక్స్‌పోర్ట్స్‌ పార్క్‌ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై అఫిడవిట్‌ దాఖలు చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడమే కాకుండా ఈ రంగాన్ని దీర్ఘకాలంలో లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయం లో నేతన్నను ఆదుకోవడానికి ప్రభుత్వం చేయూత పథకం కింద థ్రిఫ్ట్‌ ఫండ్‌ పొదుపు మొత్తం రూ.92.1 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. దీనికి అదనంగా ఆహార భద్రత కార్డుల ద్వారా ప్రభుత్వం అందించే సాయాన్ని 31,284 కుటుంబాలు వినియోగించుకున్నాయని చెప్పారు. ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానికంగా ఎన్జీవోల ద్వారా నిధులు సేకరించి రూ.1.57 కోట్ల విలువై న నిత్యావసర వస్తువులు, ఆర్థికసాయాన్ని చేనేత కార్మిక కుటుంబాలకు అందజేశారని వివరించారు. 

బతుకమ్మ చీరలపై 300 కోట్లు ఖర్చు

చేనేత కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు 2017 సంవత్సరం నుంచి బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టిందని శైలజా రామయ్యర్‌ తెలిపారు. దీనిపై ఏటా దాదాపు 300 కోట్ల నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని చెప్పారు. కోఆపరేటివ్‌ సొసైటీల నుంచి టెస్కో సేకరిస్తున్న చేనేత చీరలు, ఇతర ఉత్పత్తుల ధరలను మార్కెట్‌ రేట్ల ప్రకారం ఎప్పటికప్పుడు పెంచి చెల్లి స్తున్నదని తెలిపారు. కోఆపరేటివ్‌ సొసైటీలకు డీసీసీబీల ద్వారా పావలా వడ్డీ రుణాలను ప్రభుత్వం అందజేస్తున్నదని చెప్పారు. మొత్తం వడ్డీలో సొసైటీలు 25 శాతం చెల్లిస్తుండగా 75 శాతం ప్రభుత్వం చెల్లిస్తున్నదని చెప్పారు.

28.97 కోట్ల రుణాలు మాఫీ..

చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 46 జారీచేసిందని శైలజారామయ్యర్‌ చెప్పారు. ఈ పథకం కింద లక్ష వరకు రుణాలు మాఫీ చేసిందని తెలిపారు. ఇప్పటివరకు 10,148 కుటుంబాలకు చెందిన రూ.28.97 కోట్ల మొత్తాన్ని మాఫీ చేసిందని పేర్కొన్నారు. చేనేత కార్యక్రమాలను కొనసాగించాలనుకునే కార్మికులకు తాజాగా రుణాలు అందించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీచేసిందని తెలిపారు.logo