హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ చర్యలు మీడియాను భయపెట్టేలా ఉన్నాయని, ఇవి మీడియాలో ఓ భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఉపా చట్టం కింద ‘తెలుగు స్ర్కైబ్’ అనే డిజిటల్ మీడియా వివరాలు కావాలని ఏకంగా ఎక్స్‌ను కోరడంపై ఎడిటర్స్ గిల్డ్ ఇండియా స్పందించింది. ఎక్స్‌కు రాసిన సంబంధిత లేఖను ఉపసంహరించుకోవాలని, తెలంగాణ రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛకు అనుకూల వాతావరణాన్ని పునరుద్ధరించాలని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాన్ని కోరింది. తెలంగాణలో మీడియాపై కఠిన చట్టమైన యూఏపీఏ(ఉ.పా) వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి గిల్డ్ లేఖ రాసింది. మీడియా స్వేచ్ఛను కాపాడాలని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని గిల్డ్ స్పష్టం చేసింది. తెలుగు స్ర్కైబ్ అనే సోషల్ మీడియా ‘అభ్యంతరకరమైన, అసభ్యకరమైన భాష’ ఉపయోగించిందని ఆరోపిస్తూ, ప్రజా ప్రతినిధి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందనే ఆరోపణలకు స్పష్టమైన ఉదాహరణలు ఇవ్వలేదని గిల్డ్ తెలిపింది. మీడియా సంబంధిత అపవాదు, తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే చట్టపరమైన మార్గాలు ఉన్నాయని గిల్డ్ స్పష్టం చేసింది. ఉపా. వంటి ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ఈ తరహా సందర్భాల్లో ఉపయోగించడం దుర్వినియోగంగా భావిస్తున్నట్టు వెల్లడించింది.