హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సవాల్‌ను స్వీకరిస్తున్నామని, తెలంగాణ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీయేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ అహంకారానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పౌరుషానికి ప్రతీకగా ఉన్న కేసీఆర్‌కు మధ్య జరుగుతున్న పోటీలో ధర్మమే గెలుస్తుందని, న్యాయమే నిలుస్తుందని అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో బాగుచేసిన కేసీఆర్ గెలవాలా? 55 ఏండ్లు తెర్లుతెర్లు చేసిన కాంగ్రెస్, తొమ్మిదిన్నరేండ్లలో నయా పైసా పనిచేయని బీజేపీ గెలవాల్నా నిర్ణయించాల్సింది తెలంగాణ ప్రజలేనని అన్నారు. తెలంగాణ ఏనాడు తల దించదు.. తల వంచదని తేల్చి చెప్పారు.
బుధవారం తెలంగాణ భవన్లో కూకట్పల్లి కాంగ్రెస్ నేత గొట్టిముక్కల వెంగళ్రావు, పీసీసీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు జీ విశ్వతేజరావు, రాజమల్లయ్య, చున్నూబాయ్, పుష్పరాజ్, యాకయ్య, కంచిస్వామి, దినేశ్, వెంకట్, కిట్టు, మల్లేశ్‌గౌడ్, గురుమూర్తి, గణేశశ్, మహ్మద్ షమీ, మహ్మద్ షరీఫ్, అస్లామ్, ప్రవీణ్‌గౌడ్, మహేశ్‌గౌడ్, అరుణ్, రేష్మ, సంధ్య, కల్పన, కృష్ణవేణి సహా 1000 మంది కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ విధించిన ఇందిరమ్మ మనువడు రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
ఓటుకు నోటు దొంగ రేవంత్‌ని పక్కకు పెట్టుకొని అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం వెళ్లు.. చూడు.. నేర్చుకో అని రాహుల్‌కు సూచించారు. కులమత భేదాలు లేకుండా ప్రజాసేవ చేసే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని, అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళలకు అనేక పథకాలు అమలు చేయబోతున్నారని తెలిపారు. హిందు-ముస్లిం, ఆంధ్ర-తెలంగాణ తగాదాలు ఒక్కటీ తెలంగాణలో లేవని పేర్కొన్నారు. కేసీఆర్ వంద రూపాయల నోటు లాంటివారైతే, కాంగ్రెస్ చిల్లర బిల్లలాంటిదని విమర్శించారు. గొట్టిముక్కల వెంగళ్రావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిపై దుమ్మెత్తిపోశారు. 50-60సీట్లను కాంగ్రెస్ నాయకులు అమ్ముకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ ఎం నవీన్‌రావు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.