హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలోని బస్తీలను కూలిస్తే కాంగ్రెస్ సర్కార్‌పై ఐక్యంగా ఉద్యమిస్తామని తెలంగాణ బస్తీ జేఏసీ చైర్మన్ గోసుల శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. నగరంలోని చాదర్‌ఘాట్ కమలానగర్ బస్తీలో శుక్రవారం ‘మూసీ తీరాన బస్తీ జనయాత్ర’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట బస్తీలను చెరబట్టి పేదలను నిర్వాసితులను చేస్తున్నదని విమర్శించారు. బస్తీల సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ జనయాత్ర చేపట్టామని తెలిపారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని అన్ని బస్తీల్లో దశలవారీగా ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ నుంచి పేదల ఇండ్లను కాపాడేందుకు ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేండ్ల నుంచి పేదల కడుపులు కొట్టి పెద్దలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ఇప్పటిదాకా స్పష్టమైన డీపీఆర్, ప్రాజెక్టు విధివిధానాలను బయట పెట్టకుండా పేదల ఇండ్లను కూలుస్తున్నారని మండిపడ్డారు. బస్తీల్లో ఇండ్లు కూల్చడానికి ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని గోసుల శ్రీనివాస్‌యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకపోవడం ప్రభుత్వం నియంతృత్వ పాలనకు నిదర్శనమని విమర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ బస్తీ జేఏసీ వైస్ చైర్మన్ ఇందిర, జేఏసీ ప్రతినిధులు సల్ల శ్రీనివాస్‌యాదవ్, రాంచందర్, శ్రీకాంత్, నాగరాజు, నాగభూషణం, రాముగౌడ్ పాల్గొన్నారు.