ఉద్యోగులకు దక్కాల్సిన గోపన్‌పల్లి భూములను అధికారం అండతో అక్రమ లేఅవుట్ చేసి కొల్లగొట్టేందుకు కొందరు పెద్దలు చేస్తున్న ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఎలాంటి సహేతుక కారణాలు చూపకుండా ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో నిలుపుదల చేసింది. తదుపరి విచారణ వరకు స్టే కొనసాగుతుందని స్పష్టంచేసింది. కొన్ని రోజులుగా చట్టాలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు పాతరవేస్తూ సర్కారీ పెద్దల మౌఖిక ఆదేశంతో రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రైవేటు వ్యక్తులకు వత్తాసు పలుకుతున్న తీరు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశమైంది.
స్పెషల్ టాస్క్బ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి అసైన్డ్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 17 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రంగారెడ్డి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. గతంలో ప్రభుత్వమే పీవోటీ కింద స్వాధీనం చేసుకోవడం, ఆపై ఏపీ ఎన్జీవోలకు ఇచ్చిన భూమిని కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగుల కోసం తిరిగి స్వాధీనం చేసుకోవడం, వీటన్నింటికీ మించి ఈ భూములపై కొన్నేండ్లుగా హైకోర్టు స్టే కొనసాగుతుండటం… ఇలా ఏ కోణంలో చూసినా సర్కారు ఆధీనంలో ఉండాల్సిన భూములవి.
ఇటీవల ఆ భూములను ప్రైవేటు వ్యక్తులకు సహేతుక కారణం లేకుండానే ధారాదత్తం చేయడం అధికార, న్యాయ వ్యవస్థలను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. కోర్టు స్టే ఇవ్వడంతో తాత్కాలికంగా ఉపశమనం లభించినా ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తుల చెర నుంచి విడిపించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవోలు స్పష్టంచేస్తున్నారు. సర్వే నంబర్లు 36, 37లోని 189.11 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు ధారాదత్తం చేసిన ఎపిసోడ్ మరిన్ని కీలక మలుపులు తిరిగే అవకాశముంది. రూ.వేల కోట్ల విలువైన భూముల్ని ప్రభుత్వ పెద్దలు కొందరు కొల్లగొట్టేందుకు వేసిన వ్యూహం ప్రస్తుతానికి బెడిసికొట్టింది.
సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ‘ముఖ్య’నేత సోదరులు ఈ భూములపై భారీ స్కెచ్ వేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత తనయుడు, ఎంపీ ఏకంగా 70 ఎకరాలపై గురిపెట్టి శ్రీకారం చుట్టిన ఈ బిగ్ భూ దందాలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర రెవెన్యూ అధికారుల పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
‘మాదేం లేదు.. అంతా పైనుంచి’ అనే ఒకే ఒక్క నినాదంతో మొదటి దశలోనే 91 ఎకరాలను చేతులు మార్చేందుకు అధికారులు అన్నిరకాల ప్రొసీడింగ్స్, ఇతర శాఖలకు పంపే లేఖలను సిద్ధం చేసుకున్నారు. ఈ ప్లాన్ విజయవంతంగా అమలైతే మిగిలిన సుమారు వంద ఎకరాలను సైతం వివిధ సాకులతో పప్పు బెల్లంలా పంచుకునే యోచన కూడా ఉందనే ప్రచారం జరిగింది. ఈ సమయంలోనే అత్యంత విలువైన ఐటీ కారిడార్‌కు ఆనుకొని ఉన్న ఈ ప్రభుత్వ భూములను ఫలహారం కాబోతున్న ముప్పును ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికార యంత్రాంగం తన దూకుడును తగ్గించింది.
ఈ భూముల వ్యవహారంలో ప్రధానంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులు బయటికి రాకుండా గోప్యత పాటించడం వెనక భారీ అవినీతి, అవకతవకలు ఉన్నాయని తెలుస్తున్నది. ఒకే నంబర్‌పై రెండు వేర్వేరు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయంటే అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో చోటుచేసుకుందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఎంత గోప్యత పాటించినప్పటికీ ‘నమస్తే తెలంగాణ’ రెండు ఉత్తర్వులను వెలుగులోకి తీసుకువచ్చింది. అందులో భాగంగానే సర్వే నంబర్ 36లో ప్రభుత్వ ఉద్యోగులు గతంలో అధికారిక లేఅవుట్ చేసిన భూమిని సైతం ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన వైనాన్ని ఎత్తి చూపింది. ఎలాంటి సహేతుకమైన కారణాలు, ఆధారాలు లేకుండానే కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం, దానిని అడ్డం పెట్టుకొని వినాయకనగర్ హౌసింగ్ సొసైటీ ముసుగులో భూమిని స్వాధీనం చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు అందరి కండ్ల ముందే అక్రమ లేఅవుట్‌ను రూపొందించారు.
కంటెయినర్లు వేసి వంద ఫీట్ల రహదారిని నిర్మించారు. దీంతో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సహకారంతో భాగ్యనగర్ టీఎన్జీవో ముంచుకొస్తున్న ముప్పును గుర్తించి ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. సర్వేనంబర్ 36లో ‘మా భూమి మాగ్గావాలె’ అంటూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. నెల రోజులుగా వెనక్కి తగ్గకుండా ఉద్యోగులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివిధ స్థాయిల్లో అధికారులకు ఉద్యోగుల జేఏసీ ఫిర్యాదు చేసింది. అయినా అధికారిక బరితెగింపును ఎవరూ అడ్డుకోలేదు. కేవలం ప్రేక్షకపాత్ర వహించారు.
రాష్ట్ర రాజధానిలో, అందునా ప్రభుత్వ ఉద్యోగులు తమకు దక్కాల్సిన భూమిని ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో రంగారెడ్డి జిల్లా అధికారులు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారంటూ మొత్తుకున్నా ప్రభుత్వంలోని ఏస్థాయి ఉన్నతాధికారి కూడా పట్టించుకోలేదు. దీంతో ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకువచ్చిన ఉత్తర్వుల ఆధారంగా భాగ్యనగర్ టీఎన్జీవో న్యాయం కోసం హైకోర్టు తలుపుతట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ హయాం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం ఈ భూముల కేటాయింపు జరిగిన తీరు, ఆపై చోటుచేసుకున్న పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ప్రధానంగా 2014 లోనే హైకోర్టు ఈ భూములపై ఇచ్చిన స్టేటస్ కో అంశాన్ని గుర్తు చేసింది.
మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సదరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు ఈ భూములు కావని రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ ఇచ్చిన నివేదికలను కోర్టు ముందు ఉంచింది. వీటన్నింటినీ తుంగలో తొక్కి ఎలాంటి కారణాలు లేకుండా రంగారెడ్డి కలెక్టర్ 17.04 ఎకరాల ప్రభుత్వ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ రిజిస్ట్రేషన్ శాఖకు రాసిన ఉత్తర్వులను (ఇ1/202/2025, తేదీ:23.6.2025) కోర్టు దృష్టికి తీసుకుపోయింది. దీంతో వెంటనే స్పందించిన హైకోర్టు ఈ ఉత్తర్వులను పరిశీలించాల్సిన అవసరం ఉన్నందున తదుపరి విచారణ వరకు సదరు ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు స్టే జారీచేశారు.
ఈలోగా ఆ భూములను మూడో వ్యక్తి పేరిట లావాదేవీలు జరపకుండా నిలువరించారు. తదుపరి విచారణను వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేశారు. ఈ తాత్కాలిక ఉపశమనం కాకుండా తాము గతంలో అధికారికంగా చేసిన 142.15 ఎకరాలను పరిరక్షించుకోవడమే తమ బాధ్యత అని భాగ్యనగర్ టీఎన్జీవో స్పష్టం చేస్తున్నది. అప్పటివరకు తమ ఆందోళన కొనసాగిస్తామని, న్యాయ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నది.