Google Map | అక్కన్నపేట, డిసెంబర్ 10: ఓ ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో గానీ గూగుల్ మ్యాప్ మాత్రం ఓ వ్యాన్ డ్రైవర్‌ను ఆగం చేసింది. గూగుల్ మ్యాప్ సాయంతో చేస్తున్న ప్రయాణం కాస్తా ప్రాజెక్ట్ నీటిలోకి తీసుకెళ్లింది. బాధిత డ్రైవర్ రాజేందర్, క్లీనర్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లిలోని ములకనూరు స్వకృషి మహిళా పాల డెయిరీకి సంబంధించిన పాల కవర్ల తుక్కును శనివారం రాత్రి డ్రైవర్ డీసీఎంలో లోడ్ చేసుకొని హైదరాబాద్‌కు బయలుదేరాడు. ములకనూరు నుంచి వయా హుస్నాబాద్, రామవరం, కొమురవెల్లి మీదుగా హైదరాబాద్‌కు వెళ్లేందుకు గూగుల్ మ్యాప్‌ను అనుసరించాడు.
హుస్నాబాద్ దాటిన తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టు బైపాస్ రోడ్డు సమీపంలో నందారం క్రాస్ రోడ్డు వద్ద దారి అర్థంకాకపోవడంతో ఎడమవైపు వెళ్లాల్సిన వ్యాన్‌ను కుడివైపు తిప్పడంతో గూగుల్ మ్యాప్ సైతం అటే హైదరాబాద్‌కు దారి చూపించింది. అదే సరైన రోడ్డు అనుకొని ముందుకు వెళ్లగా.. వ్యాన్ నేరుగా ప్రాజెక్టు నీటిలోకి వెళ్లింది. డీసీఎం అప్పటికే సగం వరకు మునగడంతో భయపడి నిలిపివేశాడు. కిందికి దిగి చూసే సరికి చుట్టూ నీళ్లు ఉండటంతో ఈదుకుంటూ బయటకు వచ్చాడు. ఆదివారం ఉదయం స్థానికుల సాయంతో జేసీబీతో డీసీఎం వాహనాన్ని నీళ్ల నుంచి బయటకు తీయడంతో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లాడు. గూగుల్ మ్యాప్‌ను నమ్మితే కొంపమునిగిందంటూ డ్రైవర్ రాజేందర్ వాపోయాడు.