పాలకుర్తి, నవంబర్13: పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ రైల్వేస్టేషన్ పరిధిలోని కన్నాల గ్రామం (282/37/38 మైలురాయి) వద్ద మంగళవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. కర్ణాటక బళ్లారి నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తున్న ఐరన్ కాయల్స్ (ఇనుప రోలర్ల లోడ్) వ్యాగన్ రాఘవపూర్ స్టేషన్ సమీపంలో మిడిల్ ట్రాక్‌పై నడుస్తుండగా భారీ ప్రమాదం జరిగింది. 44 బోగీలు ఉన్న గూడ్స్ రైలు వ్యాగన్లో ముందు 9 వ్యాగన్ల అనంతరం జాయింట్ ఊడిపోయింది. ఒక్కసారిగా 12 వ్యాగన్లు ఒకదానిపై ఒకటిపడి 12 బోగిలు ధ్వంసం కాగా.. దక్షిణ మధ్య రైల్వేకు రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. వ్యాగన్లు ఒకదానిపై మరొకటి దొర్లడంతో 300 మీటర్ల మేర మూడు ట్రాక్‌లు ధ్వంసమయ్యాయి. ఎలక్ట్రికల్ లైన్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే దక్షిణమధ్య రైల్వే ఈ మార్గం గుండా నడిచే 20 రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే వివిధ విభాగాల రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, డీఆర్ఎం భరతేశ్కుమార్, కలెక్టర్ కోయశ్రీహర్ష, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులను సమీక్షించారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ నుంచి భారీ వాహనాలను తెప్పించి, రెండు ట్రాక్‌లను పూర్తిస్థాయిలో నిర్మించారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్, సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. రాత్రి ఏడున్నర గంటలకు ఒక ట్రాక్‌ను సిద్ధం చేసి, గూడ్స్‌ను నడిపించారు.