హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : అగ్రిగోల్డ్ బాధితులకు అతి పెద్ద ఊరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ అధికారుల కృషితో లక్షల మంది ఖాతాదారులకు మేలు జరగనున్నది. 2018 నుంచి ఈడీ జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను బాధితులకు పంపిణీ చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు ఈడీ అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఈడీ జప్తు చేసిన ఆస్తులు మారెట్ విలువ ప్రకారం సుమారు రూ.7 వేల కోట్లుగా అంచనా వేశారు. అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ సీమ్ బాధితులకు త్వరలోనే సొమ్మును అందజేయనున్నట్టు తెలిపారు. సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు ఈడీ ప్రకటనతో హర్షం వ్యక్తంచేస్తున్నారు.