హైదరాబాద్ మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వేదికగా నిర్వహిస్తున్న అందాల పోటీల్లో విదేశీయురాలికి అవమానం జరగడం బాధాకరమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మహిళా నేత గొంగిడి సునీత పేర్కొన్నారు. తనను వ్యభిచారిణిలా, ఆటబొమ్మలా చూశారంటూ పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ వ్యాఖ్యానించారని, మహిళలను గౌరవించే గడ్డమీద ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇదేనా మనం విదేశీ మహిళలకు ఇచ్చే గౌరవం.. వారిని గౌరవించే సంస్కారం? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మిస్ ఇంగ్లండ్‌ను అవమానించిన అందాల పోటీల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పార్టీ అధిష్ఠానం అనుమతి తీసుకొని త్వరలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఆదివారం తెలంగాణభవన్‌లో రజనీ సాయిచంద్‌తో కలిసి మీడియాతో గొంగిడి సునీత మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీల పేరిట రేవంత్ సర్కారు నిర్వాకంతో ప్రపంచ దేశాల్లో తెలంగాణ పరువు మసకబారిందని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి అందాల పోటీల ఈవెంట్లకు ఆరుసార్లు హాజరుకావడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. మిస్ వరల్డ్ పోటీల ప్రచారంలో మహిళా మంత్రులను విస్మరించి సీఎం, డిప్యూటీ సీఎం, టూరిజం శాఖ మంత్రి ఫొటోలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కేటీఆర్ దక్షతతో ఫార్ములా-ఈ కార్ రేస్ ద్వారా రూ.700 కోట్లు పెట్టుబడులు సాధించామని గుర్తుచేశారు. అప్పుడు తప్పుబట్టిన సీఎం రేవంత్‌రెడ్డి, ఇప్పుడు మాత్రం పెట్టుబడుల కోసం అందాల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.
కేసీఆర్ పాలనలో మహిళలకు సముచిత గౌరవం లభించిందని గొంగిడి సునీత పేర్కొన్నారు. మహిళలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. మన సంస్కృతీ, సంప్రదాయలను కాపాడేందుకు ఎంతగానో కృషి చేశారని చెప్పారు. విదేశాల్లోనూ మన సంస్కృతికి గౌరవం లభించిందని, ఆస్ట్రేలియా లాంటి దేశం బతుకమ్మను అధికారిక పండుగగా ప్రకటించిందని గుర్తుచేశారు. అభివృద్ధి చేయడం, అప్పులు కూడా తేవడం చేతగాని అసమర్థ కాంగ్రెస్ సర్కారు అందాల పోటీల నిర్వహణలోనూ విఫలమైందని విమర్శించారు. రజనీసాయిచంద్ సాయిచంద్ మాట్లాడుతూ.. మిస్‌వరల్డ్ పోటీల్లో ఓ విదేశీ మహిళను అమానించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై మహిళాలోకం స్పందించాలని కోరారు. మిస్ ఇంగ్లాండ్‌ను ఇబ్బందిపెట్టిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.