యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను కూడా ఏపీ తరలించుకుపోతున్నా రేవంత్ సర్కార్ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు తాగు, సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారైనా నీటి బాధలు తప్పడం లేదని దుయ్యబట్టారు.
పరిస్థితి ఇలాగేవుంటే రానున్న రోజుల్లో ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ వాటాను వాడుకునే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. 2002లో వేల ట్రాక్టర్లతో రైతులంతా కృష్ణా బరాజ్‌పై నిరసన వ్యక్తం చేశారని, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. తెలంగాణ సమస్యలపై మాట్లాడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, బీజేపీకి లేవన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కే రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.