చెన్నూర్ టౌన్, ఆగస్టు 23 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచి-2లో జరిగిన అవకతవకల్లో రూ.12.61 కోట్ల విలువైన బంగారంతోపాటు రూ.1.10కోట్ల నగదు మాయమైనట్టు ఆడిట్ అధికారులు తేల్చారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు చెన్నూర్ పట్టణ సీఐ దేవేందర్రావు శనివారం మీడియాకు వెల్లడించారు. ఇందులో ప్రధాన సూత్రధారి అయిన క్యాషియర్ నరిగె రవీందర్ ఆచూకీ మూడు రోజులుగా తెలియడం లేదని అన్నారు.
అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు తెలిపారు. ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని, నిందితుడిని త్వరలోనే పట్టుకుని కోర్టులో హాజరుపరిచి బాధితులందరికీ న్యాయం చేస్తామని పేర్కొన్నారు. ఈ కేసులో క్యాషియర్ నరిగె రవీందర్, కొంగండి బీరేశ్, నరిగె సరిత, నరిగె స్వర్ణలత అలియాస్ గోపు, ఉమ్మల సురేశ్, కోదాటి రాజశేఖర్, గౌడ సుమన్, ఏసంపల్లి సాయికిరణ్, ఎల్ సందీప్, మోత్కూరి రమ్యపై కేసు నమోదు చేసినట్టు సీఐ పేర్కొన్నారు.