హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బంగారం దోపిడీ ముఠాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లగ్జరీ కార్లలో తిరుగుతూ, మారణాయుధాలతో నగల దుకాణాలపై పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లు రక్తం చిందించడానికైనా వెనుకాడడం లేదు. రెండేండ్లుగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వరుస గోల్డ్ రాబరీలు, కాల్పుల ఘటనలు వ్యాపారవర్గాలతోపాటు సామాన్య ప్రజలను సైతం వణికిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్ నడిబొడ్డున ఉన్న జ్యువెల్లరీ షోరూమ్‌లో కస్టమర్ల రూపంలో లోపలికి వచ్చిన ఐదుగురు దుండగులు అడ్డుకున్న సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సుమారు కేజీ బంగారంతో పారిపోయారు. ఇదే తరహాలో హైదరాబాద్ చందానగర్‌లోని దుకాణంలో సైతం ముఠాసభ్యులు గాల్లోకి కాల్పులు జరిపి, మేనేజర్ కాలిని తుపాకీతో కాల్చారు. కోఠి పరిధిలో తెల్లవారుజామున వ్యాపారిపై జరిగిన కాల్పుల ఘటన సాయుధ ముఠాల నెట్వర్ ఎంతలా విస్తరించిందో కండ్లకు కడుతున్నది.
గతంలో బ్యాంకులు, ధనవంతుల ఇండ్లను టార్గెట్ చేసిన దొంగలు, ఇప్పుడు జ్యువెల్లరీ షాపులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. 2024 నుంచి 2026 మధ్యకాలంలో బంగా రం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2024 జనవరిలో 24 క్యారెట్ల బంగారం తులం రూ.63 వేలు ఉండగా.. ఇప్పుడది రూ.1.59 లక్షలకు చేరింది. ఏడాదిలోనే రూ.లక్ష వరకూ పెరుగుదల కనిపించింది. దీంతో తకువ పరిమాణంలో దోచినా భారీ మొత్తంలో దొంగలకు డబ్బు సమకూరుతున్నది. కరెన్సీ నోట్లకైతే సీరియల్ నంబర్లు ఉంటాయి కాబట్టి వాటిని సులభంగా ట్రాక్ చేయవచ్చు. కానీ బంగారానికి ఎలాంటి నంబర్లు ఉండవు. దోపిడీ చేసిన కొన్ని గంటల్లోనే దాన్ని కరిగించి ముద్దలుగా మార్చేస్తే, అది ఎకడిదో గుర్తించడం పోలీసుల తరమూ కాదు. పైగా రూ.కోటి నగదును మోసుకెళ్లాలంటే పెద్ద బ్యాగులు కావాలి. దొరికిపోయే ప్రమాదం ఎకువ. అదే రూ.కోటిన్నర విలువైన బంగారాన్ని జేబులో లేదా పౌచ్‌లో వేసుకుని రాష్ట్రాలు దాటించవచ్చు.
రాష్ట్రంలో జరుగుతున్న దాడుల వెనుక బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన ప్రమాదకరమైన సుబోధ్‌సింగ్, కుందన్భగత్ వంటి అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ల హస్తం ఉన్నట్టు నిఘావర్గాలు గుర్తించాయి. వీరు ముందుగా ప్రశాంతంగా ఉండే నగరాలను ఎంచుకుని, భద్రతా లోపాలున్న జ్యువెల్లరీ షాపులపై నెలల తరబడి రెకీ నిర్వహిస్తారు. స్థానికంగా లభించే నాటుతుపాకులు, కత్తులతో దాడులు చేసి క్షణాల్లో సరిహద్దులు దాటి పారిపోతున్నారు. సుబోధ్‌సింగ్ గ్యాంగ్‌కు తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్లో నెట్వర్ ఉందని సమాచారం. వీరికి తోడు నేపాలీ గ్యాంగులు, ఉత్తరాది ముఠాలు కూడా ఇండ్లు, ఆలయా లు, జ్యువెల్లరీషాపులపై దాడులు చేస్తున్నాయి.
వరుస ఘటనలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లోని అన్ని ప్రధాన నగల దుకాణాల్లో కచ్చితంగా గన్మెన్లను ఏర్పాటు చేసుకోవాలని, అలారం సిస్టమ్స్, 360-డిగ్రీల సీసీ టీవీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫేస్ కవర్ చేసుకునేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, డిస్ప్లే బోర్డులకు బలమైన వ్యవస్థ ఉండాలని, విలువైన వస్తువులు కిటికీలు, తలుపుల దగ్గర పెట్టవద్దని చెబుతున్నారు. షోరూమ్‌లో అన్నిచోట్లా ఎమర్జెన్సీ అలారం స్విచ్‌లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇంటెలిజెన్స్, సరిహద్దు నిఘాను పెంచి, ఈ ముఠాలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.