పెద్దపల్లి, మార్చ్ 17(నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతుల కన్నీళ్లను తుడిచేందుకు ‘గోదావరి తల్లి కన్నీటి గోస’ మహాపాదయాత్ర పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సోమవారం ప్రారంభమైంది. గోదావరి వద్ద నుంచి ఎర్రవల్లి వరకు సాగే 180 కిలోమీటర్ల పాదయాత్రను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, నడిపల్లి దివాకర్రావుతో కలిసి ప్రారంభించారు. బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో గోదావరి తీరంలోని శివుడు, సమ్మక్క గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి పాదం కదిపారు. రామగుండం క్రాస్ రోడ్డు వద్ద బీఆర్ఎస్ అధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ప్రతి కూడలి వద్ద పాదయాత్ర బృందానికి మహిళలు మంగళహారతులు పడుతూ స్వాగతం పలికారు. ‘గోదావరి తల్లి కన్నీటి గోస’ మహాపాదయాత్రతో కాంగ్రెస్కు కనువిప్పు కలుగుతుందనని కొప్పుల పేర్కొన్నారు.