హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): మహానది-గోదావరి, గోదావరి కావేరీ నదుల అనుసంధానం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)కురాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ శనివారం లేఖ రాశారు. ఇటీవల జరిగిన జనరల్ బాడీ సమావేశంలో గోదావరి-కావేరితోపాలు ఇతర నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఎన్‌డబ్ల్యూడీఏ పలు విషయాలను వెల్లడించింది. వాటిపై తెలంగాణ ప్రభుత్వం లేఖ ద్వారా తన అభిప్రాయాలను తెలిపింది. తొలుత మహానది-గోదావరి నదుల అనుసంధానం చేపట్టాలని, ఆ తరువాత గోదావరి-కావేరి నదులను అనుసంధానించడం సాధ్యమవుతుందని నొక్కి చెప్పింది. తెలంగాణ ప్రాంత సాగునీటి అవసరాలు తీరిన తరువాతనే నీటిని మళ్లించాలని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కోయినా-ముంబై, మధ్యకొంకణ్ భీమా వ్యాలి, కోయినా-నీరా, ముల్షి-భీమా, అదేవిధంగా కర్ణాటక ప్రతిపాదించిన ఆల్మట్టి- మలప్రభ సబ్‌బేసిన్, మలప్రభ-తుంగభద్ర లింక్ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆయా ప్రాజెక్టులు దిగువనున్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయని స్పష్టం చేసింది. అవి తెలంగాణకు లైఫ్‌లైన్ ప్రాజెక్టులని, అన్ని రాష్ర్టాల ఒప్పందం లేకుండా ఆ ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టకూడదని తెలంగాణ స్పష్టం చేసింది.