ఖమ్మం, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయం కొంతమేర తగ్గి సాయంత్రానికి స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం 47.90 అడుగులు ఉన్న నీటిమట్టం ఉదయం 10 గంటలకు 47.70 అడుగులకు తగ్గింది. మధ్యాహ్నం 12 గంటలకు మళ్లీ ఒక ఇంచు పెరిగింది. సాయంత్రం 7 గంటలకు 48.40 అడుగులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెద్ద ఎత్తున వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్నది. గురువారం ఉదయం నాటికి మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు అంచనావేస్తున్నారు.
అన్ని పరిస్థితులకు అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అప్రమత్తం చేశారు. వరద 48 అడుగుల వద్ద ఉండటంతో అధికారులు 3వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలం ఛత్తీస్‌గఢ్ ప్రధాన రహదారిపై వరద కొంత తగ్గడంతో బుధవారం చిన్న వాహనాలు రాకపోకలు కొనసాగించాయి. దాదాపు అన్ని గ్రామాల్లోనూ అధికారులు విద్యుత్తు సౌకర్యాన్ని పునరుద్ధరించారు. భద్రాచలం రామాలయం సమీపంలోకి చేరుకున్న వరద నీటిని శక్తివంతమైన పది మోటార్లతో గోదావరిలోకి పంపింగ్ చేశారు.