భద్రాద్రి కొత్తగూడెం, జూలై 27 (నమస్తే తెలంగాణ): వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం పట్టణం లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద చేరింది. గోదావరి తీర ప్రాంతమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది. శనివారం రాత్రి 11 గంటలకు 53.60 అడుగుల వద్ద వరద ప్రవహించడంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం క్రమేపీ పెరగడంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భద్రాచలానికి పక్కనే ఉన్న ఆంధ్రా ప్రాంతానికి కూడా తెలంగాణతో రాకపోకలు తెగిపోయాయి. అటు శబరి.. ఇటు గోదావరి నదులు పొంగి ప్రవహించడంతో చింతూరు-చట్టి రహదారిపైకి నీరు చేరి నెల్లిపాక నుంచి చింతూరు వెళ్లే రహదారికి రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం రోడ్డులో వరద రహదారి పైకి చేరడంతో వీఆర్‌పురం వెళ్లే రహదారికి రాకపోకలు లేవు. దీంతో అటువైపు వెళ్లే వాహనాలను సారపాక క్రాస్‌రోడ్ వద్దనే నిలిపివేశారు. ఎడతెరిపిలేని వర్షాలకు ఒకవైపు తాలిపేరు.. మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చర్ల మండలంలోని వాగులు, చెరువులు పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి 1,13,752 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.