భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. శనివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 53.80 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం ఉదయం 5.2 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. 48 అడుగుల కంటే తక్కువకు చేరితే దానిని కూడా ఉపసంహరిస్తారు.
కాగా, గోదావరికి వరద పోటెత్తడంతో రహదారులపై నీరు చేరింది. దీంతో ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి.. దుమ్ముగూడెం చర్ల స్టేట్ హైవేపై వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అలాగే భద్రాచలం నుంచి బూర్గంపాడు రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలోని అశోక నగర్ కొత్తకాలనీ, ఏఎంసీ కాలనీలు నీట మునిగాయి. మొత్తం 94 కుటుంబాలకు చెందిన 306 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.