హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగర భవిష్యత్తు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ‘గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్-2’కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ మంగళవారం జీవో 345 జారీచేశారు. గోదావరి రెండో దశ పనులకు ప్రభుత్వం రూ.5,560 కోట్లు కేటాయించింది. హెచ్ఏఎం మోడ్‌లో భాగంగా 40 శాతం ప్రభుత్వ వాటా, 60 శాతం సంబంధిత ఏజెన్సీ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్టు దక్కించుకున్న ఏజెన్సీ రూ.3,336 కోట్లు తొలుత భరించి ఆ తర్వాత జలమండలి నుంచి వసూలు చేయనుంది. 40 శాతం ప్రభుత్వ వాటా కోసం రూ. 2,224 కోట్ల హడ్కో రుణాన్ని తీసుకోనున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించనుంది. ప్రాజెక్టు ద్వారా నగరానికి అదనంగా గోదావరి జలాలు తరలించడంతో పాటు హియాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాలకు పునరుజ్జీవం తేనున్నారు. కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 30 టీఎంసీలు కేటాయించి నగరానికి తాగునీటి భరోసా కల్పించారు. ఇందులో భాగంగానే గోదావరి రెండో దశ పనులు చేపట్టేందుకు సర్కారు నిర్ణయించింది.
జలమండలి రోజూ హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు కృష్ణా మూడు దశలు, గోదావరి తొలి విడత, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, సింగూ రు, మంజీరాల నుంచి 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నది. దాదాపు 13 లక్షల నల్లా కనెక్షన్లకు తాగునీటిని అందిస్తున్నది. హైదరాబాద్ విస్తరిస్తుండటం, ఓఆర్ఆర్ వరకు జలమండలి పరిధి విస్తరించడంతో 2030 వరకు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని 170 ఎంజీడీల అదనపు జలాల సరఫరాను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. గోదావరి నుంచి మొత్తం 30 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు ఉండగా గోదావరి ఫేజ్-2 ద్వారా అదనపు జలాలు వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. 2030 వరకు హైదరాబాద్ తాగునీటి డిమాం డ్ 750 ఎంజీడీల వరకు పెరగనున్నదని అధికారులు అంచనావేస్తున్నారు. 2050 నాటికి 1014 ఎంజీడీలుగా ఉండనున్నది. ఈ డిమాండ్ మేరకే ప్రాజెక్టు పట్టాలెక్కిందని అధికారులు చెబుతున్నారు.
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ఫేజ్-1 కింద నగర ప్రజల నీటి అవసరాల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తున్నది. రెండో దశ ద్వారా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉన్నది. 15 టీఎంసీల్లో 10 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాలకు పోను మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాల పునరుజ్జీవనానికి మరో 5 టీఎంసీలు ఉపయోగించనున్నారు. డీపీఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను వ్యాప్కోస్ కంపెనీ సిద్ధంచేసింది. పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు, మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ వరకు 3600 ఎంఎం డయా పైపులైన్ నిర్మించనున్నారు. ఘన్పూర్, శామీర్‌పేట్ వద్ద 780 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటిశుద్ధి కేంద్రాన్ని (డబ్ల్యూటీపీ) నిర్మించనున్నారు. ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణం, ఇతర పనులు చేపట్టనున్నారు. రెండేండ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.