ఇల్లెందు, మార్చి 7 : గోదావరి జలాల సాధనే లక్ష్యంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లెందు నియోజకవర్గంలో సీతారామ ప్రాజెక్టు నిర్మించడంతో తమ పంట భూములకు నీళ్లు వస్తాయని గిరిజనులు, రైతులు ఎంతో సంతోషించారని, గిరిజన ప్రాంత భూములను ఎండబెట్టి మైదాన ప్రాంతాలకు నీళ్లు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. ఇల్లెందు నియోజకవర్గానికి, భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు గోదావరి నీళ్ల కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ముందుకు సాగుతామన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గోదావరి జలాల తరలింపు, రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని చెప్పారు.