హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వైద్య విద్యలో స్థానికతను నిర్ణయించడానికి తీసుకొచ్చిన జీవో 33ని ఉపసంహరించి, వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలన్న డిమాండ్‌తో బీఆర్ఎస్వీ (భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) ఆదివారం చేపట్టిన మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో తొలుత తెలంగాణ భవన్ నుంచి మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మంత్రుల నివాస ప్రాంగణానికి వెళ్లకుండా బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట జరిగింది.
బీఆర్ఎస్వీ నేతలు మంత్రుల నివాస సముదాయం లోపలికి చొచ్చుకెవెళ్లడానికి ప్రయత్నించారు. ప్రభుత్వానికి, సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. మరికొందరు బీఆర్ఎస్వీ నేతలు బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణం ఎదుట బైఠాయించారు. ప్రధాన గేటు ఎక్కి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నివాస ప్రాంగణంలోకి లోపలికి వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 33 జీవోను వెంటనే రద్దు చేసి కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత వల్ల కొన్ని ప్రైవేటు కాలేజీలకు డీమ్డ్ యూనివర్సిటీ హోదా రావడంతో 50% కన్వీనర్ కోట సీట్లను రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలను వైద్య విద్యకు దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ కుట్రలో భాగంగానే రాష్ట్రప్రభుత్వం జీవో 33 కొనసాగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిందని ఆరోపించారు. తెలంగాణలో పుట్టిన వారు ఇతర రాష్ర్టాల్లో చదివితే స్థానికత వర్తించకుండా జీవో నం. 33 ద్వారా కన్వీనర్ కోట సీటు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీని ద్వారా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లబ్ధి చేకూర్చే కుట్ర దాగి ఉన్నదని ధ్వజమెత్తారు. వెంటనే వైద్యవిద్య కౌన్సిలింగ్ నిర్వహించాలని, విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ విద్యార్థులకు నష్టం చేసే నిర్ణయాలు తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ నినాదాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిజం చేస్తే.. కాంగ్రెస్ సరారు దానిని దారుణంగా నీరుగారుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, కడారి స్వామియాదవ్, పడాల సతీశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్, వెంకటేశ్‌గౌడ్, గోపగాని రఘరాం, రమణ్, షఫీ, జంగయ్య, ప్రశాంత్, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.