శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 04:00:04

మన అస్తిత్వ ప్రతీక.. ఆత్మగౌరవ పతాక

మన అస్తిత్వ ప్రతీక.. ఆత్మగౌరవ పతాక

  • గ్లోబల్‌ ఇండియా నిర్మాత మన తెలంగాణ బిడ్డ
  • పీవీకి భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ, మండలి తీర్మానం
  • ఆయన సంస్కరణల ఫలాల్ని అనుభవిస్తున్న దేశం
  • శతజయంతి సందర్భంగా పీవీకి భారతరత్న ప్రకటించాలి
  • ఆయన విగ్రహం, చిత్రపటం పార్లమెంటులో పెట్టాలి
  • శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంపూర్ణ మద్దతు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అసాధారణ ప్రజ్ఞాశాలి అయిన పీవీ నరసింహారావుకు ఆయన శతజయంతి సందర్భంగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని రాష్ట్ర శాసనసభ, శాసనమండలి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశాయి. పార్లమెంట్‌ ప్రాంగణంలో పీవీ విగ్రహం, చిత్రపటాన్ని ఏర్పాటుచేయాలని కోరాయి. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని సూచించాయి. ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శాసనసభలో, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శాసనమండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్‌.. పీవీ సేవలను బహుముఖంగా కొనియాడారు.

 తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పీవీ ప్రతీక  అన్నారు. గ్లోబల్‌ ఇండియా నిర్మాతగా దేశ చరిత్రను మలుపుతిప్పిన నాయకుడు పీవీ అని తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన పీవీ నరసింహారావు తనదైన దార్శనికతతో నూతన ఆర్థిక సంస్కరణలను వేగంగా, సాహసోపేతంగా అమలుచేశారని పేర్కొన్నారు. విదేశాంగనీతిలో, విద్యారంగంలో, భూసంస్కరణల్లో ఇలా ప్రతి రంగంలోనూ పీవీ తనదైన ముద్రవేశారన్నారు. పీవీని భారతరత్నతో సత్కరించుకోవడం అంటే.. దేశం తనను తాను గౌరవించుకున్నట్లేనని సీఎం కేసీఆర్‌ చెప్పారు.


logo