హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సమావేశాల్లో ‘నీళ్లివ్వండి- నిధుల్విండి’ అనే డిమాండ్ మార్మోగిపోయింది. నీటిపారుదల శాఖ తీరుపై విపక్షంతోపాటు అధికారపక్షం నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల పనులను నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సంతాప తీర్మానాల అనంతరం జీరో అవర్‌ను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ.. ప్రధానంగా సాగునీటి సమస్యలను ప్రస్తావించారు. తమ తమ నియోజకవర్గాల్లో ఇరిగేషన్ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ నుంచి లక్షల మంది భక్తులు తరలివెళ్తున్నారని, అయితే, అక్కడి వసతులు లభించక ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రస్తావించారు. తిరుపతిలో కర్ణాటక, తమిళనాడు ప్రత్యేక వసతి భవనాలు నిర్మించుకున్నాయని, అదే తరహాలో తెలంగాణభవన్ నిర్మించాలని కోరారు.

భీమ్‌గల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వం 100 పడకల వైద్యశాలను రూ.35 కోట్లతో మంజూరు చేసిందని, స్టాఫ్‌ను కూడా కేటాయించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఇప్పటికే 80% పనులయ్యాయని, రూ.30 కోట్ల వరకు గతంలోనే చెల్లించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రూ.5 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని కోరారు.

వరదల నివారణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ) చేపట్టిందని, మొదటి విడత పనులు తుది దశకు చేరుకున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వివరించారు. సెకండ్ ఫేజ్ పనులు చేపట్టాలని కోరారు.
జనగామ-హుస్నాబాద్ మధ్యలో గానుగపాడు వంతెనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.90 లక్షల బిల్లు విడుదల చేయాలని ఇప్పటికి మూడుసార్లు విజ్ఞప్తి చేశానని, సర్కార్ నుంచి స్పందన లేకుండా పోయిందని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు.
ప్రభుత్వం కాలువల్లో పూడిక సైతం తీయడం లేదని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. తన నియోజకవర్గంలో 2.5 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్నదని, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ కిందనే ఆయకట్టు ఉన్నదని వివరించారు. ప్రధాన కాలువలు పూడుకుపోయాయని తెలిపారు.
మేడిగడ్డను బాంబులతో పేల్చినట్టుగానే తన నియోజకవర్గంలో తనుగుల చెక్‌డ్యామ్‌ను పేల్చివేశారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. ఆ ఘటనపై తక్షణం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టు కింద దాదాపు ఏడు వేల ఆయకట్టు ఉన్నదని, గతంలో వరదలతో ప్రాజెక్టు కొట్టుకుపోయిందని తెలిపారు. తక్షణం డీపీఆర్‌ను ఆమోదించి, ప్రాజెక్టును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
నెలరోజులుగా చలిలో సోయా, మక్క రైతులు మార్కెట్లలో పడిగాపులు గాస్తున్నారని, అయినప్పటికీ కొనుగోలు చేసేవారే లేకుండా పోయారని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మూసారంబాగ్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణం చేపట్టాలని అంబర్‌పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ డిమాండ్ చేశారు. తద్వారా అంబర్‌పేట, మలక్‌పేట వాసులకు వరదల సమయంలో ఉపశమనం చేకూరుతుందని తెలిపారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేవారని, అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వం కూడా సీడీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ.. పంచాయతీ రాజ్ రోడ్లను తక్షణం మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్డీఎస్ కాలువను చిన్నంపల్లి రిజర్వాయర్‌కు అనుసంధించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు ప్యాకేజీ-99 పనులను పూర్తి చేయాలని కోరారు. జూలపల్లి, గట్టు రిజర్వాయర్లను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
సింగరేణి ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వివరించారు. గతంలో డిపెండెంట్ ఉద్యోగాలను చంద్రబాబు తొలగించగా, కేసీఆర్ వాటిని పునరుద్ధరించారని, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రక్రియను సరిగా అమలుచేయడం లేదని పేర్కొన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం తగ్గించాలని, సమస్యలన్నీ పరిష్కరించాలని కోరారు.
గల్ప్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, అందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సూచించారు. మన ఊరు- మన బడి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరారు.
ప్రజాప్రతినిధులు భాషను అదుపులో పెట్టుకోవాలని, స్థాయిని దిగజార్చుకోవద్దని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. సభా సంప్రదాయాలు కాపాడాలని కోరారు. నూతన శాసనసభ్యులకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో వారానికి ఒకసారి మాత్రమే చెత్త తొలగిస్తున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అసంతృప్తి వ్యక్తంచేశారు. వీధిలైట్ల నిర్వహణ అధ్వానంగా తయారైందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు, విదేశీ విద్యానిధి బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఎమ్మెల్యే బలాల డిమాండ్ చేశారు.
అధికార పక్షం సభ్యులు సైతం ఇరిగేషన్ శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా తయారయ్యాయని, పట్టించుకున్నవారే లేకుండాపోయారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. బస్వాపూర్ రిజర్వాయర్‌ను రూ.1,500 కోట్లతో నిర్మించారని, దాదాపు పనులన్నీ పూర్తయ్యాయని, నీళ్లను నింపుకోవచ్చని వివరించారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. చెరువులు అన్యాక్రాంతం కావడం వల్లే కాలనీలు ముంపునకు గురవుతున్నాయని, హైడ్రా, ఇరిగేషన్ శాఖ తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు. అరికెపూడి గాంధీ మాట్లాడు తూ.. చెరువులకు సంబంధించి అధికారులు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను పూటకో రీతిగా మార్చుతున్నారని, ఫలితంగా నాలా పనులు పెండింగ్‌లో ఉంటున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులివ్వాల ని కోరారు. ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మాట్లాడుతూ.. ఎస్సారెస్పీ కెనాల్ కోతకు గురవుతున్నదని, లైనింగ్ చేపట్టాలని కోరా రు. ఎమ్మెల్యేలు సంజీవ్‌రెడ్డి, నాగరాజు.. వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.