హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): మెట్రోరైల్ రెండో దశ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందించారు. మెట్రో ఫేజ్-2 కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన ఐదు కారిడార్లను ప్రతిపాదించినట్టు తెలిపారు. ట్రిపుల్ఆర్కు సంబంధించి ఉత్తరభాగం నిర్మాణానికి ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తయినందున దక్షిణ భాగాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరారు. దక్షిణ భాగం భూసేకరణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున 50 శాతం భరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ట్రిపుల్ ఆర్కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉందని, దీన్ని ఆమోదించాలని కోరారు. డ్రైపోర్ట్తోపాటు ఏపీలోని సముద్రపోర్ట్లను కలిపేలా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును, రైలు మార్గాన్ని మంజూరు చేయాలని కోరారు. ఇక మూసీ పునరుజ్జీవానికి సహకరించాలని, ఈ ప్రాజెక్టు కోసం రూ.20 వేల కోట్లు ఆర్థిక సాయం చేయాలని ప్రధానిని కోరారు. అదేవిధంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 222.7 ఎకరాల రక్షణ భూముల బదిలీకి సహకరించాలని విన్నవించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం వల్ల రాష్ర్టానికి అదనంగా 29 ఐపీఎస్ పోస్టులను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. సీఎం వెంట మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఉన్నారు.