హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న గిగ్ కార్మికుల సంరక్షణ చట్టాన్ని అధ్యయనం చేసి.. తగిన సూచనలు చే యాలని కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి జీ వివేక్ కోరారు. గిగ్ కార్మికుల రక్షణ చట్టాన్ని రూపొందించేందుకు విధానపరమైన సిఫార్సులతో కూడిన నివేదికను సోమవారం సోమాజిగూడలోని మంత్రి నివాసంలో సీపీఐ ప్రతినిధి బృందం అందజేసింది. ఈ సందర్భంగా ప్రతినిధి బృందం సభ్యులు మాట్లాడు తూ.. దేశంలో మొట్టమొదటిసారిగా గిగ్ ఎకానమీపై నీలం రాజశేఖర్‌రెడ్డి పరిశోధనా కేంద్రం సెమినార్ నిర్వహించిందని గుర్తుచేశారు.
ఈ సెమినార్లో ప్రముఖ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ కింగ్షుక్ సర్కార్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ లేబర్ మాజీ కమిషనర్ షేక్ సలావుద్దీన్, గిగ్ కార్మిక ఫెడరేషన్ నాయకుడు డాక్టర్ పీఎస్ఎం రావు, ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల గిగ్ కార్మికులు పాల్గొన్నారని మంత్రికి వివరించారు. పరిశోధకులు, న్యాయనిపుణుల ఆధ్వర్యంలో గిగ్ కార్మికుల సవాళ్లు, అవకాశాలు, విధాన పరిష్కారాలపై దృష్టిసారించి నివేదిక రూ పొందించినట్టు తెలిపింది. మంత్రిని కలిసిన వారిలో సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, సీపీఐ జాతీయ కార్యదర్శి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం, నీలం రాజశేఖర్‌రెడ్డి, రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ టీ సురేశ్‌బాబు ఉన్నారు.