హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను వచ్చే కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణకు నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నిలబెట్టుకొనే సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి పట్ల నిబద్ధతను చాటుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి రాబోయే బడ్జెట్ ఉత్తమ సందర్భమని పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ శాఖలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసిన మంత్రి కేటీఆర్, తాజాగా పరిశ్రమల శాఖకు లభించాల్సిన ఆర్థిక సహాయంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వినూత్న పారిశ్రామిక విధానాలతో అద్భుత పారిశ్రామిక ప్రగతి సాధిస్తున్నామని మంత్రి కేటీఆర్ తన లేఖలో గుర్తుచేశారు. రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులకు అనుగుణంగా పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టినట్టు చెప్పారు. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌తోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మాసిటీని నెలకొల్పామని తెలిపారు. ఇటువంటి భారీ పారిశ్రామిక పారులు తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశ పారిశ్రామిక అభివృద్ధికి సైతం ఇతోధికంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ వంటి నినాదాలు, విధానాలను బలంగా నమ్మితే.. వాటిని నిజం చేయగలిగే శక్తి కలిగిన తెలంగాణ వంటి అభివృద్ధిపథ రాష్ట్రాలను ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలు మరింత బలంగా మారినప్పుడే దేశ ప్రగతి వేగం పెరుగుతుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందున తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి దోహదపడే అంశాలపై సానుకూలంగా స్పందించాలని కోరారు.
లేఖలో ప్రస్తావించిన ప్రధాన అంశాలు
జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు ఇవ్వాలి. రూ. 9,500 కోట్ల విలువైన నిమ్జ్ కోసం కనీసం రూ.500 కోట్లు అయినా ఈ బడ్జెట్లో కేటాయించాలి.
హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్లకు నిధుల కేటాయింపు, ఇతర విషయాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించాలి. హైదరాబాద్ ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌ను కలిపే రెండు నోడ్స్‌కు దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో కనీసం 50 శాతం నిధులను వచ్చే బడ్జెట్లో కేటాయించాలి.
హైదరాబాద్-విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. ఈ కారిడార్‌లో భాగమైన హుజూరాబాద్, జడ్చర్ల, గద్వాల, కొత్తకోట నోడ్స్ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం సుమారు రూ. 5000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో కనీసం రూ.1,500 కోట్లు కేటాయించాలి.
ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం (టీఐఈఎస్) పథకం కింద జడ్చర్ల ఇండస్ట్రియల్ పార్ లో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ) ఏర్పాటు చెయ్యాలి. ఇందుకోసం అవసరమైన గ్యాస్‌ను వెంటనే కేటాయించాలి.
బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల మంజూరు, అప్‌గ్రెడేషన్ చేపట్టాలి.
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యూనిట్‌ను మళ్లీ ప్రారంభించాలి.
హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చెయ్యాలి.
హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలి.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలి.
వరంగల్ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్ (కేఎంటీపీ) అభివృద్ధికి కేంద్రం రూ.500 కోట్ల మూలధన ప్రోత్సాహం అందించేందుకు వీలున్నది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించాలి.
సమగ్ర పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ సీమ్ (సీపీసీడీఎస్) కింద టెక్స్టైల్ పార్, వీవింగ్ పార్, అప్పారెల్ పార్లతో కూడిన మెగా పవర్లూమ్ క్లస్టర్‌ను సిరిసిల్లకు మంజూరు చెయ్యాలి.
ఇన్-సిటూ పథకం కింద పవర్‌లూమ్‌ల అప్‌గ్రెడేషన్ చేపట్టాలి.
ఎన్‌హెచ్‌డీపీ కింద బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లు మంజూరు చెయ్యాలి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని ఏర్పాటుచెయ్యాలి.
చేనేత రంగానికి జీఎస్టీని మినహాయించాలి.
హైదరాబాద్‌లో నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ క్యాంపస్‌ను ఏర్పాటుచెయ్యాలి.
హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి ఐటీఐఆర్‌ను తిరిగి మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలి. లేనిపక్షంలో దానికి సమానమైన ప్రాజెక్టు ఇవ్వాలి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఖమ్మంలో సెయిల్ ద్వారా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చెయ్యాలి.
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందివ్వాలి.