కోటగిరి, ఆగస్టు 4 : విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ‘కారం మెతుకులే..’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు కదిలివచ్చారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్, తహసీల్దార్ గంగాధర్, ఎంఈవో నాగ్నాథ్ ఆదివారం సందర్శించారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి జరిగిన విషయంపై ఆరా తీశారు. కూర ఎందుకు రుచికరంగా చేయలేదని నిర్వాహకులపై డీఈవో ఆగ్రహం వ్యక్తంచేశారు. కారంతో భోజనం పెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రశ్నించడంతో తమదే తప్పని నిర్వాహకులు ఒప్పుకున్నారు. భోజనం రుచికరంగా ఉండాలని, మళ్లీ ఫిర్యాదులు వస్తే ఏజెన్సీని రద్దు చేస్తామని డీఈవో దుర్గాప్రసాద్ హెచ్చరించారు.