పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం ఉదయం పరిశీలించేందుకు యశస్విని రెడ్డి వెళ్లారు. ఈ సమయంలో స్థానికులు ఆమెను అడ్డుకున్నారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని స్థానికులు నిలదీశారు. లబ్ధిదారులు ప్రతి ఇంటికి 50వేలు ఇస్తానని ఎన్నికలకు ముందు యశస్విని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట తప్పారు. దీంతో ఆ హామీని ఇంకెప్పుడు నెరవేరుస్తారని నిలదీశారు. మా సమస్యలు పట్టించుకోరా అని ప్రశ్నించారు. ముందుగా తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన స్థానికులను కాంగ్రెస్ నాయకులు పక్కకు తోసేశారు. దీంతో ఎమ్మెల్యను కలవనీయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారికి ఎమ్మెల్య యశస్విని రెడ్డి నచ్చజెప్పారు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేరుస్తానని చెప్పి.. లబ్ధిదారుల వివరాలను తీసుకుని అక్కడి నుంచి వచ్చేశారు.