అబిడ్స్, ఆగస్టు 4 : హైదరాబాద్‌లోని కట్టెలమండిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. కేసుకు సంబంధించిన వివరాలను ఆదివారం అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌లో సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్‌యాదవ్.. ఏసీపీ చంద్రశేఖర్, ఇన్స్పెక్టర్తో కలిసి వెల్లడించారు. బేగంబజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరుని కూతురు(6)ను తీసుకుని శనివారం మధ్యాహ్నం అబిడ్స్ కట్టెలమండిలోని పుట్టింటికి వెళ్లింది. అక్కడ తన సోదరి కుమారుడు(4)తో కలిసి స్థానిక ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆడుకునేందుకు వెళ్లగా, బాలిక తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా చిన్నారి గుర్తుతెలియని వ్యక్తితో కలిసి ఆటోఎక్కినట్టు గుర్తించారు. ఆటోనంబర్ ఆధారంగా పోలీసులు డ్రైవర్‌ను విచారించగా అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో దింపినట్టు చెప్పాడు. అక్కడ సైతం సీసీ కెమెరాలను పరిశీలించగా జహంగీర్‌పీర్ దర్గాకు వెళ్తున్న బస్సులో వెళ్లినట్టు కనిపించింది. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టగా కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో బాలికను తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి వైద్య పరీక్షలు చేయించి తల్లిదండ్రులకు అప్పగించగా, కిడ్నాపర్‌ను అబిడ్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కిడ్నాపర్ బీహార్‌కు చెందిన మహ్మద్ బిలాల్ అన్సారీగా గుర్తించారు.