హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) అంశాల్లో బాలికలు నైపుణ్యం పెంచుకోవాలని, ఇవే వారికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వీ-హబ్‌లో నిర్వహించిన గర్ల్స్ ఇన్ స్టెమ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులు 3డీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు.
3డీ అంటే డిజిటైజ్, డీ కార్బనైజ్, డీసెంట్రలైజ్- ఈ మూడూ విద్యార్థులకు ఎంతో కీలకమని చెప్పారు. వీటి ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఉద్బోధించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, వారిని వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు వీ-హబ్ స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు. సమావేశంలో వీ-హబ్ సీఈవో దీప్తి రావుల, వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు.