సహర్సా, సెప్టెంబర్ 17: బీహార్‌లోని సహర్సా జిల్లాలో కదులుతున్న కారులో ముగ్గురు వ్యక్తులు ఒక టీనేజీ బాలికపై సామూహిక లైంగిక దాడి చేశారని, ఈ ఘటనలో ఒక నిందితుడిని అరెస్ట్ చేసామని పోలీసులు మంగళవారం తెలిపారు. ‘ఈ నెల 14న ముగ్గురు తుపాకీతో చంపేస్తామని బెదిరించి కదులుతున్న కారులో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు మాకు ఫిర్యాదు చేసింది’ అని ఎస్పీ హిమా న్షు తెలిపారు. ఆమెను వైద్య పరీక్షలకు పంపామని, నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. దర్యాప్తుకు ప్రత్యేక బృం దాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. లైంగిక దాడి జరిగిందని చెప్తున్న కారును సీజ్ చేశామని తెలిపారు.
తిరువనంతపురం, సెప్టెంబర్ 17: నిఫా వైరస్‌తో పరిస్థితి ఆందోళనకరగా ఉన్న కేరళలోని మలప్పురంలో మంకీపాక్స్ కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా అనుమానిత కేసు ఒకటి నమోదైంది. నిఫా వైరస్‌బారిన పడి 24 ఏండ్ల వ్యక్తి ఒకరు ఈనెల 9న చనిపోగా, దీనికి తోడు మంకీపాక్స్ కూడా జిల్లాలో వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతున్నది. కొద్ది రోజుల క్రితం విదేశాలకు వెళ్లి వచ్చి అనారోగ్యంతో ఇక్కడి ఓ ప్రైవేట్ దవాఖానలో చేరగా, రోగ లక్షణాలను బట్టి అతడికి మంకీపాక్స్ సోకినట్టు అనుమానిస్తున్నామని జిల్లా వైద్య అధికారి ఒకరు చెప్పారు. అతడి నుంచి సేకరించిన నమూనాలను కోజికోడ్ మెడికల్ కాలేజీకి పంపామని, ఫలితం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. అయితే మనదేశంలో 2022 జూలై నుంచి ఇప్పటివరకు 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి.