ధర్మసాగర్, ఆగస్టు 26 : డెంగ్యూ జ్వరంతో బాలిక మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు పెసరు స్వామి కూతురు ప్రవళిక (11)కు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు డెంగ్యూ అని నిర్ధారించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తమ్ముడు కూడా జ్వరంతో బాధపడుతున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామంలో చాలామందికి విషజ్వరాలు వస్తున్నాయని, వైద్యాధికారులు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
20% డిపాజిట్‌పై మినహాయింపు ఇవ్వండి
భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పిటిషన్
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఆదాయ పన్నులో మినహాయింపు ఇస్తూ గతంలో ఐటీ శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఇప్పుడు నోటీసులు, పన్ను మదింపు ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ ఎన్ రాజేశ్వరరావు ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. కార్మికుల సంక్షేమ చట్టం కింద 2008లో ఈ మండలి ఏర్పాటైందని పిటిషనర్ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. వీటి అమలుపై స్టే ఇచ్చేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నిరాకరించడంతోపాటు మదించిన ఆదాయపన్ను మొ త్తంలో 20 శాతం డిపాజిట్ చేయాల ని షరతు విధించిందని చెప్పారు. డిపాజిట్‌పై మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై కౌం టర్ దాఖలు చేయాలని ఐటీ శాఖకు నోటీసు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది.
చెయ్యే.. ఫ్లూయిడ్ స్టాండ్
వరంగల్ చౌరస్తా, ఆగస్టు 26: ఎంజీఎం దవాఖానలో ఫ్లూయిడ్ హ్యాంగర్స్ లేకపోవడంతో రోగులు, అటెండెంట్లు ఇబ్బందులు పడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఓ రోగిని కుర్చీలో కూర్చోబెట్టి స్లైన్ బాటిల్‌ను అటెండెంట్ చేతికివ్వడంతో అది ఎక్కే వరకు ఆమె అలాగే పట్టుకుని నిలబడింది. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.