సర్కార్ కొర్రీలు పెడుతుండటంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్రైవేటు కంపెనీ అవతారమెత్తడంతో ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పత్తి కొనుగోలుకు సీసీఐ రోజుకో నిబంధన అమలు చేస్తుండటంతో రైతులు పత్తి పంటను వ్యాపారులకు తెగనమ్ముకుని, తీవ్రంగా నష్టపోతున్నారు.
ఆదిలాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్లలో (Cotton Procurment) కొర్రీలతో రైతులు అరిగోస పడుతున్నారు. సీసీఐ (CCI) ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేపడుతున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. సీసీఐ తీరుతో పత్తిని మద్దతు ధరకు (MSP) అమ్ముకునే పరిస్థితులు లేకుండా పోయాయి. నిబంధనలు సడలించాలని రైతులు కోరుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో రైతులు గత్యంతరం లేక తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. సీసీఐ ఈ ఏడాది పత్తి కొనుగోలు విషయంలో మొదటి నుంచీ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నది. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా పంటను సేకరిస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో సెల్‌ఫోన్ సిగ్నళ్లు సరిగా లేక యాప్ పనితీరు సరిగాలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110 చొప్పున కొనుగోలు చేస్తున్నది. పంటలో తేమ శాతం ఎనిమిది ఉంటేనే ఈ ధర చెల్లిస్తున్నది. ఈ తర్వాత ఒక్కో శాతానికి రూ.81 తగ్గిస్తూ 12 శాతం వరకు మాత్రమే కొంటున్నది. 12 శాతం కంటే ఎక్కువ ఉన్న పత్తిని కొనుగోలు చేయడం లేదు. జిల్లాలో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా తేమ బాగా పడుతుంది. దీంతో రైతులు పత్తిని ఎండపెట్టినా తేమ శాతం తగ్గడం లేదు. సీసీఐ అధికారులు తిరస్కరించిన పంటను రైతులు మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసి ఎండబెట్టి రాత్రీపగలు కాపలా కాస్తున్నారు. మూడు, నాలుగు రోజులైనా మంచు కారణంగా పంటలో సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం రాకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు క్వింటాల్‌కు రూ.6,800 చొప్పున విక్రయించి క్వింటాకు రూ.1,300 చొప్పున నష్టపోతున్నారు.
ఏడు క్వింటాళ్లే కొనడంతో..
సీసీఐ ఈ ఏడాది నుంచి సరికొత్త నిబంధన అమల్లోకి తీసుకువచ్చింది. ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే విక్రయించేలా కపాస్ కిసాన్ యాప్‌లో మార్పులు చేసింది. జిల్లాలో రైతులు పత్తిని ఎక్కువ సాగు చేస్తారు. ఈ ఏడాది 4.31 లక్షల ఎకరాల్లో పండించారు. నల్లరేగడి భూములు, పంట సాగుకు అనుకూలమైన వాతావరణంగా ఉండటంతో దిగుబడి ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లు వస్తుంది. సీసీఐ ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో మిగితా పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్మడంతో భారీగా నష్టం పోవాల్సి వస్తున్నది.
నేటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్
రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న సీసీఐ.. ప్రైవేటు జిన్నింగ్‌లను లీజుకు తీసుకొని పత్తి బేళ్లను తయారు చేయిస్తుంది. సీసీఐ బేళ్ల తయారీలో ఎల్1, ఎల్2, ఎల్3 నిబంధనలు అమలు చేయడంతో పలు జిన్నింగ్ వ్యాపారులు నష్టపోతున్నారు. నిబంధనలు సడలించాలని తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ నాయకులు.. అధికారులను కోరినా వారు స్పందించడం లేదు. దీంతో సోమవారం నుంచి జిన్నింగ్ వ్యాపారులు తమ పరిశ్రమలను మూసివేయనున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.
1.20 లక్షలు నష్టపోవాల్సి వస్తుంది
కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పత్తి పంటకు 11 శాతం సుంకం ఎత్తివేసి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నది. కేంద్రం నిర్ణయంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఏడు క్వింటాళ్ల నిబంధన కారణంగా నేను వంద క్వింటాళ్ల పత్తిని ప్రైవేటు వ్యాపారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో నాకు రూ.1.20 లక్షల నష్టం వస్తుంది. నాతోపాటు చాలా మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు పత్తిని విక్రయించి లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఈ విషయంలో సీసీఐ పునరాలోచించాలి.
– అమరేందర్ రెడ్డి, రైతు, నిపాని, భీంపూర్ మండలం