బండ్లగూడ, జూలై 5 : కాంట్రాక్టర్ చేసిన పనికి బిల్లు మంజురు చేయాల్సిన ఓ ఏఈ కాసుల కక్కుర్తితో ఏసీబీకి చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపిన వివరాలు.. సంతోష్‌నగర్‌కు చెందిన ముజఫరుద్దీన్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని 11 వార్డు ఆదర్శనగర్‌లో రూ.6.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేశాడు.
బిల్లు మంజురు కోసం రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజినీర్ బలవంత్‌రెడ్డి కాంట్రాక్టర్ ముజఫరుద్దీన్ను రూ.24వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఇద్దరి మధ్య బేరసారాల అనంతరం రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో ముజఫరుద్దీన్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఏఈ బలవంత్‌రెడ్డి చాంబర్లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.