హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోళ్ల భారం తడిసిమోపెడవుతున్నది. ప్రభుత్వ రంగ విద్యు త్తు ఉత్పత్తి సంస్థ అయిన టీజీ జెన్కో నుంచి విద్యుత్తు కొనుగోళ్లు తగ్గుతున్నాయి. బహిరం గ మార్కెట్ నుంచి కొనుగోళ్లు పెరుగుతున్నా యి. రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోళ్లకు 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.7,216 కోట్లు అదనంగా ఖర్చుచేశాయి. ఇవి జెన్కో నుంచి విద్యుత్తు కొనుగోలు చేయకపోవడంతో ఆ సంస్థ ఏకంగా రూ.3 వేలకోట్లపైగా నష్టపోయింది.
విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో అధికారులు మార్కెట్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. దీంతో ఆర్థిక అంచనాలు గాడితప్పి, ఆగమ్యగోచర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బహిరంగ మార్కెట్ నుంచి ఏడాదిలో 3,198 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే కొంటామని రెండు డిస్కమ్‌లు ఈఆర్సీకి సమర్పించిన నివేదికలో ప్రకటించాయి. కానీ, అందుకు విరుద్ధంగా 20,870 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మార్కెట్ నుంచి కొనుగోలు చేశాయి. అంటే ఏకంగా 17, 672 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అధికంగా కొనుగోలు చేశాయి. దీంతో వేరియబుల్ కాస్ట్ పెరిగింది. బహిరంగ మార్కెట్ నుంచి రూ.1,268 కోట్ల కొనుగోళ్లు జరిపేలా రెండు డిస్కమ్‌లకు అనుమతిస్తే.. అవి ఏకంగా రూ. 8,483 కోట్లు ఖర్చుచేశాయి. ఇది అనుమతించిన మొత్తం కంటే రూ.7,216 కోట్లు అధికం.
బహిరంగ మార్కెట్ నుంచి 1,499 మిలియన్ యూనిట్ల విద్యుత్తును మాత్రమే కొనుగోలు చేయాల్సిన దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్).. ఏకంగా 14,724 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసింది. దీంతో కొనుగోలు వ్యయం రూ.894 కోట్ల నుంచి రూ.5,985 కోట్లకు పెరిగింది. ఇది అనుమతించిన మొత్తం కంటే రూ.5,091 కోట్లు అధికం.
బహిరంగ మార్కెట్ నుంచి 1,699 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన ఉత్తర డిస్కం (టీజీఎన్పీడీసీఎల్).. ఏకంగా 6,146 మిలియన్ యూనిట్లు విద్యుత్తును కొనుగోలు చేయడంతో కొనుగోలు వ్యయం రూ.373 కోట్ల నుంచి రూ.2,498 కోట్లకు పెరిగింది. ఇది అనుమతించిన మొత్తం కంటే రూ.2,125 కోట్లు అధికం.
డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్తు కొనుగోళ్లు చేస్తుండటంతో జెన్కో పవర్ ప్లాంట్లను బ్యాక్‌డౌన్ చేస్తున్నారు. చక్కగా నడిచే ప్లాంట్లల్లో ఆకస్మాత్తుగా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. వీటిలో థర్మల్ ప్లాంట్లే ఎక్కువగా ఉంటున్నాయి. జెన్కో కంటే చౌకగా విద్యుత్తు లభిస్తున్న బహిరంగ మార్కెట్లో కొనుగోళ్లకు డిస్కమ్‌లు ఆసక్తి చూపుతున్నాయి. దీని వల్ల విద్యుత్తు కొనుగోలు చార్జీలతోపాటు ట్రాన్స్మిషన్ చార్జీలు, ట్రాన్స్మిషన్ నష్టాలు, ఫిక్స్డ్ చార్జీల రూపంలో జెన్కోకు చెల్లించాల్సిన అదనపు భారం డిస్కమ్‌లకు తప్పదని విద్యుత్తు రంగ నిపుణులంటున్నారు.
కానీ, జెన్కో ప్లాంట్లను బ్యాక్‌డౌన్ చేసుకుంటూ వెళ్తే ఆ సంస్థ నిర్వీర్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, త్వరలో 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌తోపాటు రామగుండం, పాల్వంచల్లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 ప్లాంట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. కానీ, ఇప్పటికే ఉన్న ప్లాంట్లను బ్యాక్‌డౌన్ చేయాల్సి వస్తున్నందున కొత్త ప్లాంట్లతో ఏమి లాభం ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
2025 ఆర్థిక సంవత్సరంలో జెన్కో ప్లాంట్ల నుంచి 20,330 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వాడుకోవాల్సిన దక్షిణ డిస్కమ్ కేవలం 12,671 మిలియన్ యూనిట్లు మాత్రమే వాడుకున్నది. హైడల్ ప్లాంట్ల నుంచి వినియోగించుకోవాల్సిన 4,835 మిలియన్ యూనిట్లలో 3,561 మిలియన్ యూనిట్లు మాత్రమే వాడుకున్నది. దీంతో ఈ డిస్కమ్ నుంచి జెన్కో రూ.2,100 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.
జెన్కో థర్మల్ ప్లాంట్ల నుంచి 8,486 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వాడుకోవాల్సిన ఉత్తర డిస్కమ్ కేవలం 5,289 మిలియన్ యూనిట్లు మాత్రమే వాడుకున్నది. హైడల్ ప్లాంట్ల నుంచి వినియోగించుకోవాల్సిన 2,018 మిలియన్ యూనిట్ల విద్యుత్తులో 1,486 మిలియన్ యూనిట్లు మాత్రమే వాడుకుంది. దీంతో ఈ డిస్కం నుంచి జెన్కో రూ.900 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.