హైదరాబాద్ : రాజకీయాల్లో ( Politics ) కి రావాలన్న లక్ష్యంతో నలుగురు జెన్ జీ యువతులు ( Gen Z young womens) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR )ను ఆదివారం తెలంగాణ భవన్లో కలిశారు. తాము భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నామని ఈ సందర్భం గా వారు కేటీఆర్‌కు వివరించారు. తాము మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇప్పటికే పాఠశాల దశ నుంచి ఒక గ్రూప్‌గా తాము పాలసీ అంశాల తో, సమాజంలో మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
కెరీర్ మాత్రమే లక్ష్యంగా ఉద్యోగాల కోసం తపనపడే ఈ రోజుల్లో నలుగురు ఆడబిడ్డలు నేరుగా తనను వచ్చి కలవడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో వచ్చిన నలుగురిని చూసి ఆశ్చర్యపోయానని, వారితో గడిపిన క్షణాలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ (Twitter ) లో పేర్కొన్నారు.

నలుగురు విద్యార్థినులు లండన్( London )లోని కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్, ఎకనామిక్స్ అండ్ ఫిలాసఫీ చదవనున్న సరయు, నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థిని లాస్య, సింబయాసిస్ లా స్కూల్ విద్యార్థిని రేవతి , సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో బీకాం చదువుతున్న అశ్విని ఉన్నారు. రాజకీయ పరిస్థితిని, పాలనాపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవాలని వారు కోరగా కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.
పార్టీ కార్యాలయంలోని తన బృందంతో కలిసి పనిచేసేందుకు వారికి అవకాశం కల్పిస్తామని, వారి రాజకీయ ప్రయాణంలో తగిన సూచనలు, మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. జెన్ జీ యువతలో ఉన్న ఈ ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పట్ల వారికున్న ఆసక్తిని చూస్తుంటే భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయని తెలిపారు.
రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తున్న తరుణంలో ఈ విద్యార్థినుల ఆలోచనలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని అన్నారు. వీరు భవిష్యత్తులో గొప్ప నాయకులుగా ఎదుగుతారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.తమ భవిష్యత్తు లక్ష్యాలను, రాజకీయాలపై తమకున్న దృక్పథాన్ని పంచుకున్న నలుగురు యువతులు పార్టీ కార్యాలయంలో గడిపిన సమయం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు.