హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ యూనివర్సిటీల లబ్ధి కోసమే రేవంత్‌రెడ్డి సర్కార్ జీవో 7ను తీసుకొచ్చిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. యూనివర్సిటీల గుర్తింపుతో (అఫిలియేషన్‌తో) నడిచే కాలేజీలు మూతపడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ వర్గాలతోపాటు దివ్యాంగులకు ఉన్నత విద్యను దూరం చేయాలని రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సర్కార్ వైఖరితో ఉన్నత విద్యకు బడుగు వర్గాలు దూరమవుతాయని, ఉన్నత వర్గాలే ఉన్నత విద్యను అభ్యసిస్తాయని ధ్వజమెత్తారు.
జీవో 7 ద్వారా డీబీటీ పద్ధతిలో ఏ నెలలో ఎంత శాతం ఫీజులు చెల్లిస్తారో స్పష్టత లేక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ డీబీటీ విధానంలో విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని ప్రభుత్వ ఆదేశాలను కాలేజీ యాజమాన్యాలు పాటించే పరిస్థితి ఉండదని తెలిపారు. కేవలం ఫీజులు చెల్లించిన విద్యార్థులకే అడ్మిషన్లు ఖరారు చేసే పరిస్థితి ఉంటుందని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి దూరమవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన 5 లక్షల విద్యాభరోసా కార్డు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.