హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): గుజరాత్ రాష్ట్రంలోనూ నీట్ పరీక్ష పత్రం లీకయిందని, ఎగ్జామ్ పేపర్లను విచ్చలవిడిగా అమ్ముకున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నీట్ అక్రమాలపై ప్రధాని మోదీ నోరు తెరవాలని, దేశవ్యాప్తంగా ఈ పరీక్షలో జరిగిన అవకతవకలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో నీట్ పరీక్ష పత్రాలు అమ్ముకున్న వైనంపై ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని కోరారు. నీట్ అక్రమాలతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ విద్యార్థులు భారీగా నష్టపోయారని తెలిపారు. ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న తెలంగాణలో 150 వరకూ ఒక్క ర్యాంకు కూడా రాకపోవడం నీట్ అక్రమాలకు అద్దం పడుతుందని ధ్వజమెత్తారు. గ్రేస్ మారుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఇతర దేశాల్లో 14 చోట్ల నీట్ ఎగ్జామ్ నిర్వహించారని, అక్కడా అవకతవకలు జరిగే అవకాశం ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. నీట్ అక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని, దీనిపై ఇప్పటికైనా తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీలు నీట్ విద్యార్థుల కోసం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్కడ ఉన్నారని, నీట్ అక్రమాలపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు రఘురామ్, దశరథ, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.