హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) చైర్మన్‌గా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వు కాపీని సీఎం కేసీఆర్ స్వయంగా గెల్లు శ్రీనివాస్‌కు అందజేసి అభినందించారు. తనకు కార్పొరేషన్ పదవి ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు గెల్లు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. గెల్లు శ్రీనివాస్ ఈ పదవిలో రెండేండ్లపాటు కొనసాగుతారని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగానికి గెల్లు శ్రీనివాస్ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న గెల్లుపై రాష్ట్రంలో వివిధ పోలీస్స్టేషన్లలో వందకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల జరిగిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెల్లు పోటీ చేసిన విషయం తెలిసిందే. గెల్లు నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.