హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 10 నెలల పాలనలో ప్రైవేట్ కాలేజీలకు నయాపైసా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రీన్‌చానల్ ద్వారా మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. విద్యాశాఖపై ఒక్క సమీక్ష కూడా పెట్టలేదని దుయ్యబట్టారు. రూ.6,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా రాష్ట్రంలోని 12.50 లక్షల మంది విద్యార్థులను రేవంత్ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఓవర్సీస్ సాలర్షిప్ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు అమలుచేయకపోవడంతో విదేశీ విద్యకు విద్యార్థులు దూరమవుతున్నారని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించని కారణంగా కళాశాలల యాజమాన్యాలు బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదని, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో అప్పులు చేసి ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఈ నెల 14 వరకు గడువు ఉన్న స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు సిద్ధమైన నర్సింగ్ కాలేజీల విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తలేరని తెలిపారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తానని చెప్పిన ఆకునూరి మురళి ఇష్టం లేకే రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడం లేదా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రైవేటు కళాశాలలను పరిశీలిస్తున్నట్టుగానే, ప్రభుత్వ గురుకులాలను కూడా పరిశీలిస్తే నాసిరకమైన భోజనం, విద్యార్థుల కష్టాలు తెలుస్తాయని చెప్పారు. గతంలో బాసర ట్రిఫుల్ ఐటీ గోడలు దూకి వెళ్లిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ఒక్కసారి కూడా అక్కడికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం క్షమాపణ చెప్పాలి
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు గంజాయి తాగుతున్నారంటూ అభాండాలు వేసిన సీఎం రేవంత్ వారికి క్షమాపణలు చెప్పాలని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆయన వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అడుగుతున్నారనే విద్యార్థులను ఈ విధంగా బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, నాయకులు నవీన్‌గౌడ్, విశాల్, కాల్వ నితీశ్ పాల్గొన్నారు.