హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): అమృత కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం బీఆర్ఎస్వీ నేతలు, విద్యార్థులు హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. అమృత కాలేజీకి అనుమతులు లేకున్నా పారా మెడికల్ డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు తీసుకున్నారని మండిపడ్డారు. విద్యార్థులు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పారామెడికల్ బోర్డు కార్యదర్శి ప్రేమ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు, నాయకులు ఖుర్రమ్ అలీ, వికాస్, యశ్వంత్, ప్రవీణ్, సాయితేజ, సాయిపటేల్, వంశీ పాల్గొన్నారు.