హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): సామాన్యుడు రూ.118 విద్యు త్తు బిల్లు చెల్లించకుంటే అధికారులు ఆగమేఘాలపై స్పందిస్తారని, విద్యుత్తు కనెక్షన్‌ను కూడా తొలగిస్తారని, అదే పేరున్న సంస్థ లేదా పలుకుడి ఉన్న వాళ్లు రూ.118 కోట్ల బకాయి ఉన్నప్పటికీ చర్యలు తీసుకోరని హైకోర్టు (High Court) తప్పుపట్టింది. గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) విశ్వవిద్యాలయం (Geetam University) అక్షరాలా రూ.118.13 కోట్ల మేరకు విద్యుత్తు బకాయి ఉన్నప్పటికీ ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. గీతం వర్సిటీ రెండు దశాబ్దాలుగా (2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి) విద్యుత్తు బకాయిలు చెల్లించకుండా ఉంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించింది. తక్షణమే విద్యుత్తు సరఫరాను నిలిపివేయాలని డిసం నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా ఆ వర్సిటీకి నోటీసులు జారీచేయడానికే అధికారులు ఎందుకు పరిమితం అయ్యారంటూ ఆక్షేపించింది.
వంద కోట్ల రూపాయలకుపైగా ఉన్న విద్యుత్తు బకాయిల వసూలుకు చర్యలు చేపట్టని అధికారులపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఆగ్రహం వ్యక్తంచేశారు. తన బాల్యంలో ఇంటి విద్యుత్తు బిల్లు రూ.800 వస్తే ఆ మొత్తాన్ని చెల్లించని కారణంగా అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేసిన ఘటనను న్యాయమూర్తి గుర్తుచేసుకున్నారు. గీతం విశ్వవిద్యాలయానికి విద్యు త్తు సరఫరాను నిలిపివేయకపోవడానికి దారితీసిన పరిస్థితులను వివరించేందుకు టీజీపీసీడీఎల్, సంగారెడ్డి సరిల్, సూపరింటెండింగ్ ఇంజినీర్ స్వయం గా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
పెండింగ్ విద్యుత్తు బకాయిలను చెల్లించాలని డిసమ్ జారీచేసిన నోటీసులను సవాలు చేస్తూ గీతం వర్సిటీ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. సూపరింటెండింగ్ ఇంజినీర్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో నోటీసులు జారీచేశారని, విద్యుత్తు బకాయిలను చెల్లించకపోతే సరఫరాను నిలిపివేస్తామని నోటీసుల్లో హెచ్చరించారని డిసమ్ స్టాండింగ్ కౌన్సిల్ శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఇదే తరహా నోటీసును 2020లో వర్సిటీ హైకోర్టులో సవాలు చేసిందని చెప్పారు.