దమ్మపేట/భద్రాచలం, జనవరి 7 : మూడు నెలల క్రితం చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట, భద్రాచలం( Bhadrachalam) జీసీసీ కార్యాలయాల ఎదుట జీసీసీ హమాలీలు(GCC hamalis) రోజుకో విధంగా నిరసన తెలిపారు. వీరికి పలు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. దమ్మపేట సమ్మె శిబిరంలో జీసీసీ హమాలీ కార్మికులు మంగళవారం కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. శిబిరాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేశ్ దొర ప్రారంభించి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో జాప్యం చేస్తున్నదని, వేతన ఒప్పందం ప్రకారం రెండేళ్లకొసారి రేట్లు పెంచాలని, పీఎఫ్ సౌకర్యం, పనిభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలో సమ్మె శిబిరాన్ని సీఐటీయూ జిల్లా నాయకులు ఎంబీ నర్సారెడ్డి, కొలగాని రమేశ్‌లు ప్రారంభించి మాట్లాడారు. మూడు నెలల క్రితం రేట్ల ఒప్పందం జరిగినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో హమాలీలు సమ్మెకు దిగారన్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో హమాలీ మేస్త్రీ బోగి సత్యం, కార్మికులు బోగి నర్సింహారావు, మణికంఠ, శ్రీను, రాజు, ప్రసాద్, చెన్నారావు, స్వామి, సీఐటీయూ నాయకులు నాగరాజు, అజయ్‌కుమార్, మురళీకృష్ణ, హమాలీ నాయకులు ప్రసాద్, శేషు, లోకేశ్, ముత్తయ్య పాల్గొన్నారు.