హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి (జీసీ) లింకు ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం ప్రాజెక్టు నుంచే చేపట్టాలని ఏపీ సర్కారు మరోసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఎదుట మరోసారి ప్రతిపాదనలు పెట్టింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలో ఎన్డ బ్ల్యూడీఏ 39వ వార్షిక సమావే శంలో ఏపీ పలు ప్రతిపాదనలు చేసింది. జీసీ లింకు ను ఇచ్చంపల్లి నుంచి కూడా తాము చేపడుతున్న పోలవరం-నల్లమలసాగర్ నుంచి చేపట్టడమే మేలని వివరించింది. బనకచర్ల వరకు గోదావరి జలాలను తీసుకెళ్లి, అక్కడి నుంచి సోమశిలకు, ఆపై కావేరికి మళ్లించవచ్చని తెలిపింది.
ఈ ప్రతిపాదనలను తెలంగాణ అధికారులు తీవ్రంగా ఖండించా రు. పోలవరం నుంచి జీసీ లింకు ప్రాజెక్టును చేపడితే కేవలం ఏపీకే లబ్ధి చేకూరుతుందని, అప్పుడు అది జాతీయ ప్రాజెక్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పోలవరం నుంచి జీసీ లింక్ చేపడితే 1980లో చేసుకున్న ఒప్పందాలన్నీ తుంగలో తొక్కినట్టేనని, కొత్తగా మళ్లీ టీఏసీ అనుమతులన్నీ తీసుకోవాలని స్పష్టం చేసింది. లింకు ప్రాజెక్టులో మళ్లించే జలాల్లో కో-బేసిన్ రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సిందేనని, తెలంగాణకు సైతం 200 టీఎంసీల జలాలను మళ్లించుకునే అవకాశమివ్వాలని కోరారు. ఎన్పీపీలో భాగమైన బెడ్తి-వరద నదుల అనుసంధానంపై కేంద్రంతో కర్ణాటక ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. కర్ణాటక ఇరిగేషన్ అధికారులు, ఎన్ డబ్ల్యూడీఏ సీఈ దేవేందర్‌రావు ఈ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.