నిజామాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చెరుకు రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకున్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అన్నదాతలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. బైబ్యాక్ ఒప్పందాల ముసుగులో రైతుల సమ్మతి లేకుండానే వారి పేరిట బ్యాంకు రుణాలు తీసుకున్న వైనాన్ని ‘నమస్తే తెలంగాణ’ బుధవారం వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో ఆ సంస్థ దిగొచ్చింది. రైతుల పేరిట తీసుకున్న రుణాలను పది రోజుల్లోపు బ్యాంకులకు చెల్లిస్తామని వెల్లడించింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని ఫ్యాక్టరీలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏండ్లుగా ఇలా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నామని, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదని చెప్పారు. బైబ్యాక్ ఒప్పందంలో భాగంగానే యాజమాన్యం బ్యాంకులతోనూ రుణాల కోసం ఒప్పందం చేసుకుంటుందని, ఇదంతా పారదర్శకంగా చేపట్టినట్టు తెలిపారు. పది రోజుల్లోనే బ్యాంకులకు చెల్లింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కేవైసీ అప్డేట్ కావడం వల్లే ఇదంతా జరిగిందంటూ పారదర్శక వ్యవస్థపైనే నిందలు వేసేందుకు ఆయన ప్రయత్నించడం గమనార్హం.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లోని దాదాపు 10 మండలాల్లో చెరుకు సాగు చేస్తుంటారు. ఆయా గ్రామాల్లో చెరుకు సాగు చేసే రైతులతో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ ఒప్పందాలు చేసుకుంటుంది. ఫ్యాక్టరీకి చెందిన బాధ్యులు సదరు రైతులతో పలు డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకుంటారు. అయితే, చెరుకు సాగుకు తప్ప రుణాల విషయంలో రైతులెవ్వరూ ఫ్యాక్టరీకి ఎలాంటి ఒప్పందాలను రాసివ్వరు. కానీ, ఇదే అదునుగా భావించి ఫ్యాక్టరీ నిర్వాహకులు రూ.కోట్లలో రుణాలను సేకరిస్తుండటం తాజాగా బయటపడింది. ఇందులో రుణమాఫీ పరిధిలోని రుణాలు కూడా ఉండటంతో రైతులంతా లబోదిబోమనగా వారికి ‘నమస్తే తెలంగాణ’ అండగా నిలిచింది. రైతులతో మాట్లాడి వారి వేదనకు అక్షర రూపం ఇచ్చింది. ‘రైతు చేయని రుణాలూ మాఫీ’, ‘ఒప్పందాల పేరిట దారుణం’ శీర్షికలతో బుధవారం ప్రచురించిన ప్రత్యేక కథనాలు జిల్లాలో కలకలం రేపాయి. వీటిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం వివరాలను ఆరా తీసింది. సంబంధీకులపై సీరియస్ కావడంతో గాయత్రి షుగర్స్ యాజమాన్యం దిగొచ్చింది.
గాయత్రి షుగర్ ఫ్యాక్టరీస్, రైతులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ 20 ఏండ్లుగా కొనసాగుతున్నది. ఇందులో రైతుల పాత్ర సూక్ష్మమే. పత్రాలపై సంతకాలతోనే సరిపెడతారు. కానీ, బ్యాంకు, షుగర్ ఫ్యాక్టరీ మధ్య ఒప్పందం అధికారికంగా జరుగుతుంది. ఈ విషయం సగానికంటే ఎక్కువ మంది రైతులకు తెలియదు. సంతకాలు పెట్టి బైబ్యాక్ ఒప్పందాలు చేసుకోవడం మినహా ఇందులో బ్యాంకర్లు, షుగర్ ఫ్యాక్టరీ పాత్రపై ఎలాంటి అవగాహన రైతులకు లేదు. ట్రైపార్టీ అగ్రిమెంట్ ఆధారంగా చేసుకుని యూనియన్ బ్యాంకు నుంచి రుణాలను ఫ్యాక్టరీ స్వీకరించింది. ఇందులో ఫ్యాక్టరీ ఆస్తులను పూచీకత్తుగా యూనియన్ బ్యాంకు పరిగణనలోకి తీసుకున్నది. ట్రైపార్టీ కింద మంజూరైన రుణాలకు వాస్తవానికి రుణమాఫీ వర్తించదు. సర్కారు జారీచేసిన మార్గదర్శకాల్లోనూ ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, బ్యాంకులు, వ్యవసాయాధికారులు మాత్రం రుణమాఫీ కింద వీటిని పరిగణించడంలో దాగి ఉన్న మర్మం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో అనర్హులకు రుణమాఫీ అంశంపై విచారణకు ఆదేశాలు జారీచేశాం. ఆర్డీవో, జిల్లా వ్యవసాయాధికారులకు ఈ బాధ్యతలను అప్పగించాం. రెండు రోజుల్లోనే విచారణ నివేదిక వస్తుంది. ఆ తర్వాత అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో రైతులకు జరిగిన ఈ ధోకాపై కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు కనీసం పెదవి విప్పలేదు. అసెంబ్లీ సమావేశాల నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ తన సొంత నియోజకవర్గంలో జరిగిన తంతుపై స్పందించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.