Minister Ponguleti | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీతో సత్సంబంధాల ఆరోపణలున్న గౌతమ్ అదానీతో భేటీ అయినట్టు తెలిసింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్లోని ప్రెసిడెన్షియల్ సూట్లో జరిగిన వీరి సమావేశ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. అయితే, వీరిద్దరి మధ్య భేటీ జరిగిందని, సాయంత్రం 5:30 గంటలకు వీరిద్దరు సమావేశమైనట్టు సోషల్ మీడియా కోడై కూస్తున్నది. ఇది వ్యక్తిగత భేటీనా? ప్రభుత్వం తరఫున జరిగిన భేటీనా? అన్నదానిపై స్పష్టత లేదు. వీరిద్దరితోపాటు కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా కన్సల్టెంట్‌గా ఉన్న సునీల్ కొనుగోలు కూడా ఉన్నారని విశ్వసనీయంగా తెలిసింది.
సుమారు గంటకుపైగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గౌతమ్ అదానీ మధ్య సమావేశం జరిగినట్టు చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో సమావేశం అనంతరం అదానీ తిరిగి వెళ్లినట్టు తెలిసింది. అయితే, భేటీపై రాష్ట్రప్రభుత్వం, మంత్రి పొంగులేటి, అదానీ గ్రూప్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఒకవైపు జాతీయస్థాయిలో అదానీపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేస్తుండగా, సీఎం రేవంత్ దావోస్‌లో అదానీలో ఒప్పందాలు చేసుకోవటం, నంబర్ 2గా చెప్పుకుంటున్న పొంగులేటి.. ఆయనతో రహస్య భేటీ కావటం రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో దోస్తీ.. దేశవ్యాప్తంగా కుస్తీ ఏమిటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదానీతో ఎందుకు అంటకాగుతున్నారని కాంగ్రెస్ పార్టీలోనూ పలువురు సీనియర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఎందుకు కలిశారు..?
అదానీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోబోతున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ, విమర్శలు రావడంతో ఒప్పంద వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే, నగర శివారులో అతి పెద్ద భూమికి సంబంధించిన అంశంపై వీరి భేటీ జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన ఓ కంపెనీని అదానీ సంస్థ తిరిగి కొనుగోలు చేస్తున్నదని.. ఆ కంపెనీ కొనుగోలు విషయంలో ఇద్దరు కలిశారని చెప్తున్నారు. అదానీతో తన కంపెనీకి సంబంధించిన డీల్ ఫైనల్ చేసుకోవడానికే పొంగులేటి కలిశారని, దానికోసం రాష్ట్రంలోని పలు కీలకమైన ప్రాజెక్టులు అదానీ గ్రూపునకు ఇచ్చే అంశంపైనా చర్చ జరిగినట్టు చెప్తున్నారు. సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్తు ప్రాజెక్టులు తదితర వాటికి సంబంధించి కీలక చర్చలు జరిగినట్టు తెలిసింది. ప్రభుత్వం కూడా ఒక భారీ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు.
రాయదుర్గంలోని 84 ఎకరాలను కట్టబెట్టేందుకేనా?: కేటీఆర్
ఐటీసీ కోహినూర్లోని ప్రెసిడెన్షియల్ సూట్లో తెలంగాణ క్యాబినెట్‌లోని నంబర్-2తో అదానీ ఎందుకు సమావేశమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ఇదే సమావేశంలో సునీల్ కనుగోలు కూడా ఉన్నారని, ఆయన ఏం చేస్తున్నారని అడిగారు. అదానీతో కాంగ్రెస్ దోస్తీ కట్టిందా? లేదంటే రాయదుర్గంలోని 84 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని అదానీకి కట్టబెట్టే కుట్ర చేస్తున్నారా? అని నిలదీశారు.